మొదలైన వర్టికల్ డ్రిల్లింగ్.. తవ్వాల్సింది 86 మీటర్లు..

మొదలైన వర్టికల్ డ్రిల్లింగ్..  తవ్వాల్సింది 86 మీటర్లు..

న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్​లోని టన్నెల్​లో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు అధికారులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇన్ని రోజులు టన్నెల్​కు సమాంతరంగా చేపట్టిన డ్రిల్లింగ్ పనులకు అడ్డంకులు ఎదురవడంతో ఇప్పుడు వర్టికల్ డ్రిల్లింగ్ పై ఫోకస్ పెట్టారు. కొండ పైనుంచి నిట్టనిలువునా డ్రిల్లింగ్ చేస్తున్నారు. ఈ పనులు ఆదివారం నుంచి మొదలుపెట్టారు. రెస్క్యూ పనుల వివరాలను నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ (ఎన్డీఎంఏ) మెంబర్ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అతా హస్నైన్ మీడియాకు వెల్లడించారు. 

‘‘హారిజంటల్ డ్రిల్లింగ్ తర్వాత వర్టికల్ డ్రిల్లింగే బెస్ట్ ఆప్షన్. ఆదివారం మధ్యాహ్నం నుంచి వర్టికల్ డ్రిల్లింగ్ మొదలుపెట్టాం. ఇప్పటి వరకు 15 మీటర్లు పూర్తి చేశాం. మొత్తం 86 మీటర్ల వరకు చేయాల్సి ఉంది. ఆ తర్వాత టన్నెల్ క్రస్ట్ ను పగులగొట్టి కార్మికులను బయటకు తీసుకొస్తాం” అని తెలిపారు. 

మాన్యువల్ గా తవ్వాల్సింది 15 మీటర్లు.. 

మాన్యువల్ డ్రిల్లింగ్ పైనా ఫోకస్ పెట్టామని హస్నైన్ చెప్పారు. ‘‘మేం మొత్తం ఆరు ప్లాన్స్ తయారుచేశాం. అందులో ఫస్ట్ ఆప్షన్ హారిజంటల్ డ్రిల్లింగ్. అందుకే మొదట హారిజంటల్ డ్రిల్లింగ్ మొదలుపెట్టాం. ఆగర్ మెషిన్ తో 47 మీటర్ల మేర పూర్తిచేశాం. కానీ ఆ తర్వాత మెషిన్ మొత్తం పాడైపోయింది. కొన్ని మెషిన్ భాగాలు టన్నెల్ లో ఇరుక్కున్నాయి. వాటిని కట్ చేసి బయటకు తీసేందుకు హైదరాబాద్ నుంచి ప్లాస్మా కట్టర్ తెప్పించాం. 

ఆ భాగాలన్నింటినీ తొలగించి మాన్యువల్ డ్రిల్లింగ్ ప్రారంభిస్తాం. ఇంకా 15 మీటర్ల మేర తవ్వాల్సి ఉంది. కానీ దీనికి ఎక్కువ టైమ్ పడుతుంది” అని పేర్కొన్నారు. కాగా, రెస్క్యూ సిబ్బందికి సాయం చేసేందుకు ఆర్మీ కూడా రంగంలోకి దిగింది. మద్రాస్ సాపర్స్ (ఆర్మీ ఇంజనీర్ గ్రూప్) యూనిట్ కు చెందిన సైనికులు ఆదివారం టన్నెల్ దగ్గరికి చేరుకున్నారు.