గట్టిగా చూడండి : ఫిట్ నెస్ లేని 86 స్కూల్ బస్సులు సీజ్

గట్టిగా చూడండి : ఫిట్ నెస్ లేని 86 స్కూల్ బస్సులు సీజ్

స్కూళ్ళు ఓపెన్ అయ్యాయి. ఇళ్లలో హడావిడి మొదలైంది.ఇన్నాళ్లు సెలవుల్లో ఎంజాయ్ చేసిన పిల్లలు ఇప్పుడు స్కూల్ బాట పట్టారు.ఈ  హడావిడి మాట అటుంచితే, ఆర్టీఏ అధికారులు స్కూల్ బస్సులపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. తెలంగాణాలో ఆర్టీఏ అధికారులు స్కూల్ బస్సులపై తనిఖీలు చేపట్టారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఫిట్ నెస్ లేని, పన్నులు చెల్లించని 86 బస్సులను సీజ్ చేశారు అధికారులు.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 12 వేలకు పైగా స్కూల్ బస్సులు ఉండగా, 8 వేల బస్సులు మాత్రమే ఫిట్ నెస్ పొందినట్లు గుర్తించారు. దీంతో బుధవారం ఆర్టీఏ అధికారులు 5 బృందాలుగా ఏర్పడి రాజేంద్రనగర్, శంషాబాద్, మొయినాబాద్, శేరిలింగంపల్లి తదితర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఆర్​సీ, పర్మిట్, ఇన్సూరెన్స్, ఫిట్​నెస్, పొల్యూషన్, అగ్నిమాపక పరికరాలు, ఫస్ట్ ఎయిడ్ కిట్లతో పాటు డ్రైవర్ లైసెన్స్​లను చెక్ చేశారు.

ఈ క్రమంలో ఫిట్ నెస్ లేని,15 ఏండ్లు దాటిన స్కూల్ బస్సులను ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్లపై తిప్పరాదని హెచ్చరించారు అధికారులు. ఎక్స్ పీరియన్స్ ఉన్న, 60 ఏండ్లు మించని డ్రైవర్లను నియమించుకోవాలని, డ్రైవర్లకు రెగ్యులర్ గా హెల్త్ చెకప్​లు చేయించాలని స్కూల్ మేనేజ్ మెంట్లకు సూచించారు. తనిఖీలు కొనసాగుతాయని, ప్రతి స్కూల్ బస్సు తప్పనిసరిగా సంబంధిత ఆర్టీఏ ఆఫీసులో ఫిట్ నెస్ సర్టిఫికెట్ పొందాలని చెప్పారు. ఆటో రిక్షా, స్కూల్ వ్యాన్ లలో పరిమితికి మించి స్టూడెంట్లను తీసుకెళ్తున్నారని, దీనిపై పేరెంట్స్ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు అధికారులు.