గుజరాత్‌లో గ్యాస్ సిలిండర్ పేలి 9మంది మృతి

గుజరాత్‌లో గ్యాస్ సిలిండర్ పేలి 9మంది మృతి

అమ్మాదాబాద్: గుజరాత్ లోని అహ్మదాబాద్ నగర శివార్లలోని ఓ ఇంట్లో  గ్యాస్ సిలిండర్ లీక్ అయి పేలుడు జరిగింది. ఈ పేలుడు ధాటికి ఇంట్లో నివసిస్తున్న 9 మంది చనిపోయారు. మృతుల్లో నలుగురు చిన్న పిల్లలుండడం విషాదకరం. గురువారం రాత్రి జరిగిందీ ఘటన. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నిరుపేదలు వలస వచ్చి స్థానికంగా ఉన్న ఓ ఫ్యాక్టరీలో పనిచేసుకుంటూ అక్కడే చిన్న చిన్న గదుల్లో నివాసం ఉంటున్నారు. గురువారం రాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో ఓ ఇంట్లో గ్యాస్ లీక్ అవుతుంటే వాసన పసిగట్టి పొరుగింటి వారు తలుపు తట్టారు. దీంతో ఇంట్లో నిద్రిస్తున్న వారు లేచి లైట్ వేయగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. పెద్ద మంటలు చెలరేగి 10 మందికిపైగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించగా.. అదేరోజు రాత్రి ముగ్గురు చనిపోగా.. మరో ఐదుగురు నిన్న శుక్రవారం.. ఇవాళ శనివారం మరొకరు చనిపోవడంతో మృతుల సంఖ్య 9కు చేరింది. ప్రమాదం గురించి అసాలి పోలీసు స్టేషన్ ఇన్స్ పెక్టర్ పీఆర్ జడేజా మాట్లాడుతూ వంట గ్యాస్ లీక్ కావడంతో ప్రమాదం జరిగిందని.. 10 మంది తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. ఇప్పటి వరకు 9 మంది చనిపోగా.. మరొకరు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలిపారు. వాసన పసిగట్టి హెచ్చరించేందుకు వచ్చి తలుపు తట్టిన వ్యక్తి కూడా తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నాడు. మృతులు అందరూ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గుణ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. మృతదేహాలను బాధితుల స్వగ్రామాలకు పంపే ఏర్పాటు చేస్తున్నట్లు ఇన్స్ పెక్టర్ జడేజా వెల్లడించారు.