నిజామాబాద్లో మొత్తం 90 నామినేషన్లు

నిజామాబాద్లో మొత్తం 90 నామినేషన్లు
  • ముగిసిన నామినేషన్లు
  • శుక్రవారం నుంచి స్క్రూటీని
  • ఓటర్లను చేరుకునే టార్గెట్​తో ప్రధాన పార్టీ అభ్యర్థులు

నిజామాబాద్​, వెలుగు: పార్లమెంట్​ ఎలక్షన్​లో కీలకమైన నామినేషన్​ల ఘట్టం ముగిసింది. నామినేషన్​ ప్రక్రియ షురువైన రోజు నుంచి గురువారం దాకా మొత్తం42 మంది అభ్యర్థుల తరపున 90 నామినేషన్లు రిటర్నింగ్​ ఆఫీసర్​కు అందాయి.  శుక్రవారం వాటిని స్ర్కూటినీ చేసి ఎలిజిబుల్​ నామినేషన్​లు తేలుస్తారు. ధర్మపురి అర్వింద్​తో పాటు మీసాల శ్రీనివాస్​  బీజేపీ నుంచి నామినేషన్​ దాఖలు చేశారు. 

నేషనలిస్ట్​ కాంగ్రెస్​ పార్టీ తరపున విఠల్​ మలావత్​, బహుజన లెఫ్ట్​ పార్టీ  నుంచి  అబ్బగోని అశోక్​గౌడ్​, అన్నా  వైఎస్​ఆర్​ కాంగ్రెస్​ నుంచి ఎం.డి.మన్సూర్​, యుగ తులసి పార్టీ నుంచి జి.సాయికృష్ణ మూర్తి, బహుజన ముక్తి పార్టీ నుంచి దేవతి శ్రీనివాస్​, రాష్ట్రీయ మానవ్​ పార్టీ నుంచి బోగిరి పోశం, ఇండిపెండెంట్​గా గంగా చరితారావు, ఎండీ జమీల్​, వేముల విక్రంరెడ్డి, కొత్తకొండ శక్తిప్రసాద్​, పుప్పాల లింబాద్రి, తూముకూరు జీవన్​రెడ్డి, చెంచుల అశోక్​, గోపీచంద్రయ్య, రాపెల్లి శ్రీనివాస్​, పుప్పాల లింబాద్రి, బీబీనాయక్​ నామినేషన్లు అందజేశారు. 

మే 13 దాకా కార్యకర్తలు చెమటోడ్చాలె

ఐదు శతాబ్దాలుగా దేశ ప్రజలు ఎదురుచూసిన రామమందిరాన్ని ఆయోధ్యలో నిర్మించిన ప్రధాని మోదీ మూడవసారి ప్రధాని పీఠాన్ని పక్కాగా  అధిష్టిస్తారని ఉత్తరాఖండ్​ సీఎం పుష్కర్​సింగ్​ ధామి అన్నారు. రాముడి ఆశీస్సులతో 400 సీట్లకు మించి గెలువబోతున్నామని జోస్యం చెప్పారు.  గురువారం ఆయన నిజామాబాద్​లో నిర్వహించిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. ప్రపంచాన్ని వణికించిన కరోనా విపత్కర పరిస్థితిలో అభివృద్ది చెందిన దేశాలు ఆర్థికంగా దెబ్బతిన్నాయని ప్రధాని మోదీ దక్షతతో ఆ ప్రభావం భారత్​పై పడలేదన్నారు. పైగా ప్రపంచ దేశాలకు కొవిడ్​ వ్యాక్సిన్​ అందించి కోట్ల మంది ప్రాణాలు నిలబెట్టారన్నారు.  ఎన్నికలు ముగిసే దాకా వచ్చే నెల 13 వరకు కార్యకర్తలు ప్రజల మేలుకోసం చెమటోడ్చాలని కోరారు. పసుపు బోర్డు సాధనలో ఎంపీగా అర్వింద్​ పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ ఒక్కటేనన్నారు.

ఇందూర్​ గడ్డపై పసుపు బోర్డు

నిజామాబాద్​ గడ్డపై పసుపు బోర్డు ఏర్పాటు చేయించే పూర్తి బాధ్యత తనదేనని బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్​ తెలిపారు. రైతులను కన్ఫూజ్​ చేయడానికి కాంగ్రెస్​ నాయకులు ఈ విషయంలో ఈకలు లెక్కబెడుతున్నారని నిందించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం బోర్డు సాధించానన్నారు. జీవన్​రెడ్డి గెలిస్తే కేంద్ర అగ్రికల్చర్​ మినిస్టర్​ను చేసి పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తాననడం గమ్మత్తుగా ఉందని  వాణిజ్య శాఖ అధీనంలో​ బోర్డు ఉంటుందన్నారు.  

అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్​ నుంచి ఓడిన జీవన్​రెడ్డిని నిరుద్యోగుల తరఫున ఎమ్మెల్సీని చేస్తే వారి తరపున ఏ రోజు నోరువిప్పలేదన్నారు. ప్రశ్నాపత్రాలు లీకై నిరుద్యోగ యువత ఆందోళన చెందుతున్న టైంలో వారి పక్షాన నిలబడలేదన్నారు.  రాజ్యసభ సభ్యుడు డాక్టర్​ లక్ష్మణ్​, ఎమ్మెల్యేలు ధన్​పాల్​ సూర్యనారాయణ, పైడి రాకేష్​రెడ్డి, జిల్లా పార్టీ ప్రెసిడెంట్​ దినేష్​ కులాచారి, అల్జాపూర్​ శ్రీనివాస్​, మాజీ ఎమ్మెల్యే ఏలేటి అన్నపూర్ణమ్మ, స్రవంతిరెడ్డి తదితరులు ఉన్నారు. 

ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తం

ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసి దళిత, గిరిజనుల రిజర్వేషన్​ పెంచుతామని సిట్టింగ్​ ఎంపీ అర్వింద్​ అన్నారు.  గురువారం సాయంత్రం పార్టీ ఆఫీస్​లో మీడియాతో ఆయన మాట్లాడారు. కేంద్ర హోం మంత్రి అమిత్​షా ముస్లిం రిజర్వేషన్​ రద్దుపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చారన్నారు.  సీఎం రేవంత్​రెడ్డికి బీజేపీపై ఛార్జ్​ షీట్​ వేసేంత స్థాయిలేదన్నారు.  

ఉత్తరాఖండ్​ సీఎంతో కలిసి అర్వింద్​ నామినేషన్

నిజామాబాద్​ పార్లమెంట్​ స్థానంలో బీజేపీ అభ్యర్థిగా ధర్మపురి అర్వింద్​ గురువారం నాలుగో సెట్ నామినేషన్​ వేశారు. ఉత్తరాఖండ్​ సీఎం పుష్కర్​సింగ్​ ధామి వెంట రాగా, రాజ్యసభ సభ్యుడు డాక్టర్​లక్ష్మణ్​, అర్బన్​, ఆర్మూర్​ ఎమ్మెల్యేలు ధన్​పాల్​ సూర్యనారాయణ, పైడి రాకేశ్​రెడ్డితో కలిసి ఆయన రిటర్నింగ్​ఆఫీసర్​రాజీవ్​గాంధీ హన్మంతుకు అందజేశారు.