ట్యాంక్ బండ్‌‌పై సదాలక్ష్మి విగ్రహం పెట్టాలె. మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి

ట్యాంక్ బండ్‌‌పై  సదాలక్ష్మి విగ్రహం పెట్టాలె. మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి

ముషీరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం, దళితుల సంక్షేమానికి మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ స్పీకర్ స్వర్గీయ టీఎస్ సదాలక్ష్మి తుదిశ్వాస వరకు పోరాడారని, ఆమె విగ్రహాన్ని ట్యాంక్‌‌బండ్‌‌పై పెట్టాలని మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి డిమాండ్‌‌ చేశారు. ఆదివారం హైదరాబాద్‌‌లోని ధర్నా చౌక్‌‌లో సదాలక్ష్మి సెలబ్రేషన్స్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ టీఎస్ వంశ తిలక్ ఆధ్వర్యంలో సదాలక్ష్మి 90వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి చీఫ్‌‌ గెస్ట్‌‌గా వివేక్ వెంకటస్వామితోపాటు ఎమ్మెల్యే ముఠా గోపాల్, తెలంగాణ రోడ్ సేఫ్టీ డీజీపీ కృష్ణప్రసాద్‌‌ హాజరై సదాలక్ష్మి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వివేక్ మాట్లాడుతూ సదాలక్ష్మి అనేక సామాజిక అంశాలపై ఉద్యమించారని, ఆమె స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. తొలిదశ ఉద్యమ సమయంలో హైదరాబాద్ వచ్చిన అప్పటి ప్రధాని ఇందిరా గాంధీకి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను సదాలక్ష్మి వివరించారన్నారు. అప్పటి ఉద్యమ కారుల్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, సదాలక్ష్మి జయంతి, వర్ధంతిలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలన్నారు. సదాలక్ష్మి వారసుడు వంశ తిలక్ మాట్లాడుతూ.. ట్యాంక్ బండ్‌‌పై సదాలక్ష్మి విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని చెప్పి కేసీఆర్‌‌ మాట నిలుపుకోలేదన్నారు. ఇప్పటికైనా ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ దళిత ఉద్యమ మహిళలకు గౌరవం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గోవింద్, జనార్దన్, సంపంగి శంకర్, సౌత్ సెంట్రల్ రైల్వే అధికారి భరత్ భూషణ్, శంకర్, ఆది నారాయణ, సుమన్, వంశీ, నర్సింహులు, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.