పిల్లలకు హిందీ కంటే ఇంగ్లీష్ నేర్చుకోవడం ముఖ్యం : వైఎస్ జగన్

పిల్లలకు హిందీ కంటే ఇంగ్లీష్ నేర్చుకోవడం ముఖ్యం : వైఎస్ జగన్

హిందీ భాషపై అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం ముదురుతున్న క్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు వైసీపీ అధినేత జగన్. పిల్లలకు హిందీ నేర్చుకోవడం కంటే ఇంగ్లీష్ నేర్చుకోవడం ముఖ్యమని అన్నారు. భాషగా హిందీ నేర్చుకోవడం అవసరమే కానీ.. విద్య మాత్రం ఇంగ్లీష్ మీడియంలోనే ఉండాలని అన్నారు. ఇంగ్లీష్ మీడియంలో లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2, లాంగ్వేజ్ 3, కింద మాతృభాషతో పాటు హిందీ నేర్చుకునే అవకాశం కల్పించాలని అన్నారు జగన్.

హిందీ భాషపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం నెలకొన్న క్రమంలో జగన్ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఇదిలా ఉండగా బుధవారం ( జులై 16 ) తాడేపల్లిలోని పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన జగన్ సీఎం చంద్రబాబును ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని.. భయానక వాతావరణం నెలకొందని అన్నారు. చంద్రబాబు తప్పుడు సంప్రదాయానికి తెర తీశారని.. తప్పుడు కేసులు పెట్టి తమ పార్టీ నేతలను, కార్యకర్తలను వేధిస్తున్నారని అన్నారు జగన్. రేపటి రోజున మీరు కుర్చీ దిగి మేము ఎక్కుతామని అన్నారు. ఈ సారి మావాళ్లు నేను చెప్పినా వినరని అన్నారు జగన్.

దెబ్బతిన్న వైసీపీ నేతలంతా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతిచర్య చేపడితే మీ పరిస్థితి ఏంటని అన్నారు జగన్. చంద్రబాబు వేసిన విత్తనమే రేపటి రోజున చెట్టు అవుతుందని.. తాము అధికారంలోకి వచ్చాక ప్రతిచర్య తప్పకుండా ఉంటుందని హెచ్చరించారు జగన్. రాష్ట్రంలో చట్టాలు ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి నెలకొందని అన్నారు. ఏపీలో ఒక్కటే ప్రతిపక్ష పార్టీ ఉందని.. మిగతా ప్రధాన పార్టీలన్నీ టీడీపీతో అధికారాన్ని పంచుకుంటున్నాయని అన్నారు.