91 ఏండ్ల కాంగ్రెస్ అభ్యర్థి శివశంకరప్ప మళ్లీ గెలుస్తానని ధీమా

91 ఏండ్ల కాంగ్రెస్ అభ్యర్థి శివశంకరప్ప మళ్లీ గెలుస్తానని ధీమా

దావణగెరె(కర్నాటక): ప్రజల మద్దతు, దేవుడి ఆశీర్వాదం ఉందని, బంపర్ మెజార్టీతో గెలిచేందుకు ఇంకేం కావాలని దావణగెరె సౌత్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న 91ఏండ్ల శామనూరు శివశంకరప్ప అంటున్నారు. తనను తాను ‘రేసుగుర్రం’ అని ప్రకటించుకున్నారు. కర్నాటకలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక వయస్సు ఉన్న అభ్యర్థిగా శివశంకరప్ప రికార్డు సృష్టించారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి లోక్​సభ సభ్యుడిగా ప్రజలకు సేవ చేశారు. 91 ఏండ్లు ఉన్నా కాంగ్రెస్ టికెట్ ఇవ్వడంపై ఆయన వివరణ ఇచ్చారు. ‘‘బాగా పరిగెత్తే గుర్రాలనే రేసులోకి దించుతారు. నేను కూడా ఓ రేసుగుర్రాన్ని. అందుకే కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇచ్చింది. కచ్చితంగా మళ్లీ నేనే గెలుస్తా. ముస్లింలు, లింగాయత్​లు నాతోనే ఉన్నారు” అని అన్నారు. వీరశైవ మహాసభకు ప్రెసిడెంట్​గానూ సేవలందిస్తున్న శివశంకరప్పపై బీజేపీ అభ్యర్థి బీజీ అజయ్ కుమార్ పోటీ చేస్తున్నారు.

శివశంకరప్పకు రూ.312 కోట్ల ఆస్తులు

నామినేషన్ పత్రాలతో పాటు సమర్పించిన అఫిడవిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తనకు రూ.312.75 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని శివశంకరప్ప ప్రకటించారు. ఆయన నడవాలంటే వ్యక్తుల సహాయం ఉండాలి. అయితే వినికిడి శక్తి బాగానే ఉంది. మాటలు కూడా స్పష్టంగానే మాట్లాడగలరు.