98 ఏండ్ల వయసులో బడికి

98 ఏండ్ల వయసులో బడికి

బడిగంట మోగగానే అందరు పిల్లల్లానే బ్యాగ్ వేసుకుని స్కూల్​కి వెళ్తుంది. టీచర్లు చెప్పే పాఠాలు శ్రద్ధగా వింటుంది. గబగబా నోట్స్​ రాసుకుంటుంది. బ్రేక్​ టైమ్​లో క్లాస్​మేట్స్​తో హుషారుగా ఆటలు ఆడుతుంది కూడా. ఆ పిల్లల్లో ఒకరిగా కలిసిపోయి చదువుకుంటున్న ఆమె వయసెంతో తెలిస్తే ఆశ్చర్యమేస్తుంది.  ఆమె, వాళ్లకంటే నాలుగైదేండ్లు కాదు దాదాపు 90 ఏండ్లు పెద్దది. ఆమె పేరు ప్రిసిల్లా సిటైనీ. కెన్యాకు చెందిన ఈమెకు 98 ఏండ్లు. చిన్నవయసులో బడి ముఖం చూడలేదు. అలాంటిది ఇప్పుడు పుస్తకాలు పట్టింది. ఈ వయసులో ఆమె స్కూల్​కి  వెళ్లడానికి ఓ కారణం ఉంది. 
కెన్యాలోని మారుమూల ఊర్లో ఫ్యామిలీతో కలిసి ఉంటుంది ప్రిసిల్లా.  బాగా చదివి డాక్టర్​ అవ్వాలనుకుంది. కానీ, తనకు చిన్నప్పుడు స్కూల్​కి వెళ్లే ఛాన్స్​ రాలేదు. దాంతో మంత్రసానిగా చేస్తోంది. తొంభై ఏండ్లు వచ్చాక ఆమెకి స్కూల్​కి వెళ్లే అవకాశం దొరికింది. అది ఎలాగంటే... ‘‘నా మనవరాలికి ఆరోగ్యం బాగాలేక స్కూల్​ మానేసింది. ‘స్కూల్​ ఫీజ్​ కట్టాం కదా! ఆ డబ్బులు ఎలాగూ తిరిగి రావు. నీ బదులు నేను స్కూల్​కి వెళ్తాను’ అని తనతో జోక్​ చేశాను. అయినా కూడా తను స్కూల్​కి ఇక వెళ్లనంది. దాంతో నాకు స్కూల్​కి వెళ్లాలి అనిపించింది. మధ్యలో చదువు ఆపేసిన వాళ్లకు, నా మనవలు, మనవరాండ్లకు నేను ఎగ్జాంపుల్​ అవ్వాలి. వాళ్లు బాగా చదువుకొని, మంచి స్థాయిలో ఉండాలనేది నా కోరిక. స్కూల్లో పిల్లలతో కలిసి ఆడుకుంటాను. వాళ్లంత జోష్​తో గెంతలేకపోయినా శరీరాన్ని చిన్నగా అటుఇటు కదిలిస్తాను” అంటున్న ప్రిసిల్ల స్కూల్లో​ మానిటర్ కూడా.“అల్లరి చేసే పిల్లల్ని కంట్రోల్​ చేసేందుకు ఆమెని క్లాస్​ మానిటర్​ చేశాను. ఆమె వాళ్లని అల్లరి చేయనివ్వట్లేదు. నేను బయటకి వెళ్లినప్పుడు క్లాస్ అంతా సైలెంట్​గా ఉంటోంది”అని చెప్పింది లియోనిడా తలాం అనే టీచర్​. 

ఇదిలా ఉంటే... 

చిన్నప్పుడు చదువునే అవకాశం దొరక్క, తమ కలల్ని నిజం చేసుకోలేకపోయిన పెద్దవాళ్లు కెన్యాలో చాలామంది ఉన్నారు. అలాంటివాళ్లని ప్రైమరీ స్కూల్​కి రప్పించాలి అనుకుంది అక్కడి ప్రభుత్వం. అందుకోసం 2003లో ప్రైమరీ స్కూల్​ ఫీజుల్ని తగ్గించింది. దాంతో చాలామంది ఇప్పుడు స్కూల్లో అడుగుపెట్టారు. తొంభై ఏండ్ల వయసులో బడికి వెళ్తున్న  ప్రిసిల్లా జీవితాన్ని ‘గోగో’ అనే డాక్యుమెంటరీ ఫిల్మ్​గా​ తీశారు. ‘గోగో’  అంటే కెన్యా భాషలో ‘గ్రాండ్​మదర్​’ అని అర్థం.