వికారాబాద్ జిల్లాలో న్యూమోనియాతో టెన్త్​ క్లాస్ ​విద్యార్థిని మృతి

వికారాబాద్ జిల్లాలో న్యూమోనియాతో టెన్త్​ క్లాస్ ​విద్యార్థిని మృతి

వికారాబాద్ జిల్లాలో టెన్త్​ క్లాస్​ విద్యార్థిని న్యూమోనియాతో చనిపోయింది. కుల్కచర్ల మండలం రాంపూర్ గిరిజన ఆశ్రమ పాఠశాలలో అంబిక అనే విద్యార్థిని టెన్త్​ క్లాస్​ చదువుతోంది. అయితే.. గత 10 రోజులుగా నిమ్స్ ఆస్పత్రిలో న్యూమోనియా కోసం అంబిక చికిత్స పొందుతూ మృతిచెందింది. ఆశ్రమ పాఠశాల వసతి గృహంలో ఉన్నప్పుడు అంబిక అనారోగ్యంతో బాధపడుతుంటే కనీసం హాస్టల్ సిబ్బంది తమకు తెలియజేయలేదంటూ బంధువులు ధర్నా చేపట్టారు. బాలిక కుటుంబ సభ్యులకు మద్దతుగా ప్రజా సంఘాల నాయకులు కూడా నిరసన తెలియజేశారు.

బాలిక అంబిక మృతదేహంతో కుల్కచర్ల ప్రధాన చౌరస్తాలో బైఠాయించి.. ధర్నా చేశారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలని, స్థానిక ఎమ్మెల్యే రావాలంటూ నినాదాలు చేశారు. బాధితుల ధర్నాతో పరిగి-మహబూబ్ నగర్ ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు ఆందోళనలు చేస్తున్న వారిని శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. అయితే.. తమకు స్పష్టమైన హామీ వచ్చే వరకూ ధర్నా చేస్తామని తేల్చి చెప్పారు. 

చివరకు పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అంబిక కుటుంబంలో ఒకరికి ఔట్ సోర్సింగ్ లో ఉద్యోగం, ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఆర్థికసాయం, డబుల్ బెడ్రూమ్​ ఇల్లు కేటాయిస్తామని ఎమ్మెల్యే మహేష్ రెడ్డి.. స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా హామీ ఇవ్వడంతో బాధితులు ధర్నా విరమించారు. బాలిక తండ్రి కూడా నెల రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందాడు.