
ఆమెకు పెళ్లైంది. భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతనికీ పెళ్లైంది. భార్యాపిల్లలున్నారు. ఆమె ఎదురింట్లోనే అతను ఉంటున్నాడు. ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. గత గురువారం రాత్రి వీరి వివాహేతర సంబంధం ఆమె చావును కోరింది. హోటల్ గదిలో సదరు వివాహిత అనుమానాస్పద స్థితిలో చనిపోయి విగత జీవిగా పడి ఉంది. ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. బెంగళూరులో యశోద అనే వివాహిత భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటోంది. ఆమె పొరుగునే విశ్వనాథ్ అనే ఆడిటర్ తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు.
ఈ యశోదకు, విశ్వనాథ్కు మధ్య పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. తొమ్మిదేళ్లుగా విశ్వనాథ్, యశోద వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. అయితే.. ఈ మధ్య వీళ్ల జీవితాల్లోకి ప్రియాంక అనే మరో వివాహిత ఎంట్రీ ఇచ్చింది. ఈ పరిణామంతో ఈ వివాహేతర సంబంధం ఊహించని మలుపు తిరిగింది. ప్రియాంక మరెవరో కాదు. యశోద స్నేహితురాలు. ప్రియాంకను ఓ సందర్భంలో విశ్వనాథ్కు యశోద తన స్నేహితురాలు అని చెప్పి పరిచయం చేసింది. ఆమె యశోద కంటే అందంగా ఉండటంతో వివాహేతర సంబంధాల మోజులో ఉన్న విశ్వనాథ్ కన్ను ప్రియాంకపై పడింది. యశోదకు తెలియకుండా ప్రియాంకకు దగ్గరయ్యాడు.
విశ్వనాథ్ పాచిక పారింది. తనతో పాటు ఏకాంతంగా గడిపేందుకు ప్రియాంక ఒప్పుకోవడంతో బెంగళూరులోని మగాడి మెయిన్ రోడ్లోని అగ్రహార దసరహళ్లిలో ఓయో రూం తీసుకున్నాడు. ప్రియాంక, విశ్వనాథ్ ఓయో రూంలో ఏకాంతంగా గడిపారు. కొంత కాలంగా విశ్వనాథ్ తనపై ఆసక్తి చూపకపోవడం, తనతో అంటీముట్టనట్టు ఉండటం యశోదను బాధించింది. ప్రియాంకతో విశ్వనాథ్ దగ్గరయినట్లు యశోదకు అర్థమైపోయింది. ప్రియాంక, విశ్వనాథ్ ఓయో రూంలో ఉన్న విషయం యశోదకు తెలిసిపోయింది. నిర్ధారించుకోవడానికి వీళ్లు ఉన్నారని తెలుసుకున్న ఓయో రూంకు ఎదురుగా ఉన్న హోటల్లో యశోద రూం తీసుకుంది. ఆ రూంలోనే ఉంటూ ప్రియాంక, విశ్వనాథ్ హోటల్ రూంలోకి వెళ్తూపోతూ ఉన్న దృశ్యాన్ని చూసింది.
ఇద్దరూ అదే హోటల్ రూంలో ఉన్నారని తెలుసుకుని ఓయో హోటల్కు వెళ్లి విశ్వనాథ్ రూం నంబర్ తెలుసుకుంది. విశ్వనాథ్ రూం దగ్గరకు వెళ్లి డోర్ కొట్టింది. ఎంతకూ డోర్ తీయకపోవడంతో యశోద ఏడుస్తూ.. కేకలేస్తూ గొడవ చేసింది. గొడవ పెద్దదయితే పోలీసులు వస్తారని భావించిన విశ్వనాథ్ వెంటనే రిసెప్షన్ కు ఫోన్ చేసి ఒక మహిళ ఎవరో వచ్చి గొడవ చేస్తుందని కాల్ చేసి చెప్పాడు. హోటల్ సిబ్బంది కలుగజేసుకుని, ఏమైనా ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని.. ఇలా హోటల్ కు వచ్చి గొడవ చేయొద్దని యశోదను బయటకు పంపించేశారు. ఈ పరిణామంతో తీవ్ర మనోవేదనకు గురైన యశోద తన హోటల్ రూంకు వెళ్లిపోయి ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. ప్రియుడిపై వ్యామోహంతో, వైరాగ్యంతో యశోద తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా ఇద్దరు ఆడ పిల్లలు తల్లిని కోల్పోయారు.