18 ఏళ్ల తర్వాత తలకాయ నుంచి బుల్లెట్ తీశారు

18 ఏళ్ల తర్వాత తలకాయ నుంచి బుల్లెట్ తీశారు

ఓ వ్యక్తికి 18 ఏళ్ల క్రితం తలలో ఇరుక్కున్న బుల్లెట్ ను తీశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తిని బతికించారు డాక్టర్లు. ఇన్నాళ్లు బతుకుపై ఆశలు వదులుకున్న వ్యక్తిలో మళ్లీ ఆశలు చిగురింపజేశారు. అసలింతకు ఏం జరిగింది..?

యెమెన్ కు చెందిన సలేహ్ అనే వ్యక్తికి ఇద్దరు పిల్లలు. అతడికి ఆరుగురు సోదరులు, ముగ్గురు సోదరీమణులు. చెవులు వినపడవు. 18 ఏళ్లుగా సలేహ్ తలలో మూడు సెంటీమీటర్ల పొడవున్న బుల్లెట్ ఇరుక్కుపోయి ఉంది. దాంతో అతడు చాలా ఇబ్బందులు పడ్డాడు. తరచూ చెవి నుంచి రక్తం కారడం, చెవులు సరిగా వినపడకపోవడం వంటి సమస్యలతో బాధపడేవాడు. సలేహ్.. తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తుంటారు. ఇంటికి దగ్గరలోని పొలంలో ఉల్లిపాయలు, టమోటాలు, బంగాళాదుంపలు, వెల్లుల్లి, క్యారెట్లు పండిస్తుండేవారు. 

సలేహ్.. చురుకైన పిల్లవాడు. మొక్కలకు నీరు పోయడం.. ఎరువు వేయడం వంటి పనులు (10ఏళ్ల వయసులో)  చేసేవాడు. తన తండ్రికి తరచుగా సహాయం చేసేవాడు. జీవితం సాఫీగా సాగుతున్న సమయంలో విధి వెక్కిరించింది. ఒక షాపు నుంచి తిరిగి ఇంటికి వెళ్తుండగా.. రెండు వర్గాలు గొడవ పడుతుండడం గమనించాడు. సలేహ్. అదే సమయంలో ఉన్నట్టుండి ఒక బుల్లెట్ వేగంగా దూసుకొచ్చి సలేహ్ తలలో ఇరుక్కుంది. వెంటనే అతడు కింద కుప్పకూలాడు. దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు తల్లిదండ్రులు.

డాక్టర్లు ప్రాథమిక చికిత్స అందించారు. కానీ.. తలలో ఇరుక్కున్న బుల్లెట్ ను తీయలేకపోయారు. అది అలాగే తలలో ఉండిపోయింది. ఇక అప్పటి నుంచి సలేహ్ కు కష్టాలు మొదలయ్యాయి. అతడి బాధను చూసి తల్లిదండ్రులు కూడా ఏడవని రోజు లేదు. మెల్లగా ఆరోగ్యం కూడా చెడిపోవడం ప్రారంభించింది. బుల్లెట్ చెవి గుండా దూసుకుపోవడంతో తరచూ ఇన్ఫెక్షన్లు వస్తుండేవి. ఎన్నో ఆస్పత్రులకు వెళ్లిన ఫలితం లేకుండా పోయింది.

తలలో ఇరుక్కున బుల్లెట్ తీస్తారని సలేహ్ కు ఫ్రెండ్స్ ద్వారా బెంగళూరులోని ఆస్టర్ ఆస్పత్రి గురించి తెలిసింది. వెంటనే బెంగళూరుకు వెళ్లి ఆస్టర్ ఆస్పత్రిలో జాయిన్ అయ్యాడు. అక్కడి డాక్టర్లు అన్ని రకాల పరీక్షలు చేశారు. అప్పుడే వారికి ఇదొక సవాల్ గా మారింది. ఎలాగైనా సలేహ్ తలలో ఇరుక్కున బుల్లెట్ ను తీయాలని డాక్టర్లు నిర్ణయించుకున్నారు. అదే సమయంలో అతడి ప్రాణాలకు ప్రమాదం జరగకుండా.. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. 

ముందస్తు ప్లాన్ ప్రకారం.. అన్ని రకాల వైద్య పరికరాను అందుబాటులో ఉంచుకున్నారు డాక్టర్లు. లెటెస్ట్ వైద్య పరికరాల ద్వారా తలలో బుల్లెట్ ఏ ప్లేసులో ఇరుక్కుందో గుర్తించారు. వెంటనే డాక్టర్లు సలేహ్ కు ఆపరేషన్ చేసి, బుల్లెట్ ను తీసేశారు.  దీంతో 18 ఏళ్లుగా తలలో ఇరుక్కున బుల్లెట్ ను తీయడంతో సలేహ్ కు ప్రాణం లేచివచ్చినట్లైంది. ఇప్పుడు చెవులు కూడా వినపడుతున్నాయి. చెవి నుంచి చీము కరడం ఆగిపోయింది. సర్జరీ సక్సెస్ అయిన తర్వాత సలేహ్ తిరిగి తన కుటుంబ సభ్యులతో కలిసి యెమెన్ కు వెళ్లాడు. ప్రస్తుతం అతడు ఆరోగ్యంగానే ఉన్నాడు. ఇంగ్లీషు, ఫ్రెంచ్ భాషాల్లో డిగ్రీ చదువుతున్నాడు.