మా ఊరికి బస్​ వచ్చింది : నాగరాల పునరావాస గ్రామ ప్రజలు

మా ఊరికి బస్​ వచ్చింది :  నాగరాల పునరావాస గ్రామ ప్రజలు

శ్రీరంగాపూర్, వెలుగు: ఎమ్మెల్యే చొరవతో గ్రామానికి బస్​ రావడంతో వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్​ మండలం నాగరాల పునరావాస గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏండ్లుగా బస్  సౌకర్యం కల్పించాలని కోరుతున్నా రోడ్​ సరిగా లేదని నిరాకరిస్తూ వచ్చారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బస్​ సౌకర్యం కల్పించారు. శుక్రవారం గ్రామానికి ఆర్టీసీ బస్​ రాగా, గ్రామస్తులు బస్సుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

సిబ్బందికి స్వీట్లు తినిపించి సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్​ పార్టీ సీనియర్​ నాయకుడు నరేందర్ రెడ్డి మాట్లాడుతూ పునరావాస కేంద్రాల్లో రోడ్లు బాగున్నా మాజీ మంత్రి బస్​ సౌకర్యం కల్పించే విషయంలో చొరవ చూపలేదన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామస్తులకు ఇచ్చిన మాట ప్రకారం నాగరాల గ్రామానికి బస్​ సౌకర్యం కల్పించారని పేర్కొన్నారు. మిగిలిన పునరావాస కేంద్రాలకు కూడా బస్​ సౌలత్​ కల్పించాలని కోరారు.