
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డిపై బంజారాహిల్స్ పీఎస్ లో కేసు నమోదయ్యింది. రోడ్ నంబర్ 3లో 2185 చదరపు మీటర్ల ప్రభుత్వ భూమిని దీప్తి అవెన్యూ సంస్థకు చెందిన ఉపేందర్ రెడ్డితో పాటు ఇతరులు కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారని షేక్ పేట తహసీల్దార్ అనితారెడ్డి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఉపేందర్ రెడ్డితో పాటు పలువురిపై ఐపీసీ సెక్షన్లు, 447,427,467,468,471 సెక్షన్ 3 పీడీపీపీ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అయితే ఉపేందర్ రెడ్డి మాత్రం ఈ స్థలం తమదని చెబుతున్నారు.
2018 తర్వాత పెరిగిన ఆక్రమణలు..
2018లో బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా భూఆక్రమణలు పెరిగిపోయాయి. ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, పలువురు లీడర్లు అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రభుత్వ, అసైన్డ్, చెరువు శిఖాలు, ఎండోమెంట్భూములను ఆక్రమించారనే ఆరోపణలు వచ్చాయి. దిక్కుతోచని బాధితులు జిల్లాల్లో ఉన్నతాధికారులు, పోలీస్ ఆఫీసర్లకు మొరపెట్టకున్నా కబ్జాదారులు అధికారపార్టీ నేతలు కావడంతో చర్యలకు వెనుకాడారు. పలు కేసుల్లో బాధితులు న్యాయం కోసం కోర్టు మెట్లెక్కి ఇప్పటికీ తిరుగుతున్నారు. బీఆర్ఎస్ హయంలో జరిగిన కొన్ని కబ్జాలు సంచలనం రేకెత్తించాయి. హైదరాబాద్ చుట్టూ లక్షల కోట్ల విలువైన భూములు కబ్జా చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.