
- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రైతుల వినతి
హనుమకొండ, వెలుగు: రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం భూములిచ్చిన కుటుంబాలకు ఉద్యోగావకాశాలు కల్పించాలని అయోధ్యపురం గ్రామానికి చెందిన నిర్వాసితులు కోరారు. బీజేపీ హనుమకొండ జిల్లా మాజీ అధ్యక్షురాలు రావు పద్మారెడ్డి ఆధ్వర్యంలో కాజీపేట మండలం అయోధ్యపురం గ్రామానికి చెందిన భూనిర్వాసితులు ఆదివారం హైదరాబాద్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిశారు. ముందుగా వరంగల్ నగరానికి సీజీహెచ్ఎస్ వెల్ నెస్ సెంటర్ మంజూరు చేసినందుకు రావు పద్మారెడ్డి, పోస్టల్ రిటైర్డ్ ఎంప్లాయీస్ కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. వెల్ నెస్ సెంటర్ ను త్వరగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అనంతరం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం భూములు ఇచ్చి తమ జీవనాధారం కోల్పోయామని, ఆయా కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించాలని భూనిర్వాసితులు మంత్రికి వినతిపత్రం అందజేశారు. దీంతో కిషన్ రెడ్డి స్పందిస్తూ వరంగల్ నగర అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతానని హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రిని కలిసినవారిలో తెలంగాణ రైల్వే జేఏసీ కన్వీనర్ దేవులపల్లి రాఘవేందర్, చైర్మన్ కొండ్ర నర్సింగరావు, నాయకులు అనుముల శ్రీనివాస్, కేతిరి సాయిరాజ్, అయోధ్యపురం గ్రామస్తులు ఉన్నారు.