
- మంత్రి సీతక్క
తాడ్వాయి, వెలుగు : ఈనెల 23న సీఎం రేవంత్ రెడ్డి మేడారం పర్యటనను విజయవంతం చేయాలని తెలంగాణ మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క– సారలమ్మ ఆలయ పుననిర్మాణానికి, అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. అదే రోజు మేడారం అభివృద్ధి ప్రణాళికను సీఎం ఖరారు చేస్తారని చెప్పారు. ఆదివారం మేడారం, ఐటీడీఏ క్యాంపు కార్యాలయంలో సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై కలెక్టర్ దివాకర్ టీఎస్, ఎస్పీ శబరిష్, పూజారులు, అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అధికారులు, పూజారుల సలహాలు, సూచనలను పాటించాలని చెప్పారు. మేడారం అభివృద్ధి ప్రణాళికలో భాగంగా భక్తులకు మరింత సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. సీఎం పర్యటనను పురస్కరించుకొని ఆర్ అండ్ బీ శాఖ ఆధ్వర్యంలో హెలిఫ్యాడ్ ను సిద్ధం చేశారు.
సమావేశంలో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, పూజారులు, ఎండోమెంట్ అధికారులు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అశోక్, ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ కళ్యాణి, గ్రంథాలయ చైర్మన్ రవిచందర్, ఎండోమెంట్ ఈవో వీరస్వామి, డీపీవో దేవరాజ్, ములుగు డీఎస్పీ రవీందర్, మండల అధ్యక్షుడు దేవేందర్, కాంగ్రెస్ నాయకులు
తదితరులు పాల్గొన్నారు.