పరిగిలో వీధి కుక్కను ఈడ్చుకెళ్లిన బైకర్లు.. కేసు నమోదు

పరిగిలో వీధి కుక్కను ఈడ్చుకెళ్లిన బైకర్లు.. కేసు నమోదు

ఓ వీధి శునకం ఇద్దరు వ్యక్తులను  పోలీసు స్టేషన్ మెట్లెక్కేలా చేసింది. బతికుండగానే తాడుకట్టి ఈడ్చుకెళ్ళిన ఘటన... వికారాబాద్ జిల్లా పరిగిలో జరిగింది. అనంతరం సీసీ కెమెరాలకు చిక్కడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆవేశంతో అనాలోచితంగా చేసిన పనికి చెంపపెట్టుగా వారికి చట్టపరంగా శిక్షించేలా చేయడంతో ఈ ఘటన అందరికీ కనువిప్పు కలిగేలా చేసింది. పరిగి మున్సిపల్ పరిధిలోని తెలుగు తల్లి విగ్రహం వద్ద ఇద్దరు వ్యక్తులు ఓ వీధి శునకాన్ని తాడుతో కట్టి, బైకుకు కట్టి లాకెళ్ళిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శునకాన్ని రోడ్డుపై ఈడ్చుకెళ్ళే దృశ్యాలు స్థానిక సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దీంతో ఆ వీడియో వైరల్ గా మారి స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వారికి చేరింది. 

ఈ నేపథ్యంలోశునకంపై కౄరత్వం ప్రదర్శించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఫౌండేషన్ సభ్యులు, జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్ తో పాటు పరిగి పోలీసు స్టేషన్ లోనూ ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా బైక్ తో కుక్కను లాకెళ్ళిన వారిని గుర్తించి కేసు నమోదు చేశారు. వెటర్నరీ సిబ్బంది సహాయంతో డంపింగ్ యార్డులో గాయపడి ఉన్న కుక్కను గుర్తించి స్థానిక పశు వైద్యశాలలో చికిత్స అందించారు. రోడ్డుపై నుంచి అమానుషంగా ప్రవర్తించడంతో కుక్కకు తీవ్ర గాయాలయ్యాయని  పశు వైద్యుడు తెలిపారు. వీధిలో స్వైర విహారం చేస్తూ తమ పిల్లలను కాటేయడమే కాకుండా పశువులపై దాడి చేయడం వల్ల ఆవేశంతో  చేశామని, అనాలోచితంగా చేసిన పని వల్ల ఇలా జరుగుతుందని అనుకోలేదని ఆ వ్యక్తులు పశ్చాత్తాపపడ్డారు. మూగ జీవులపై కౄరత్వం ప్రదర్శించడం తప్పని, వీధి కుక్కల వల్ల ఇబ్బందులు తలెత్తితే స్థానిక మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేయాలని స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా సంస్థ సూచించింది. మూగ జీవులను హింసించడం చటరిత్యా నేరమని....ఇలాంటి పనులకు పాల్పడితే ఎంతటివారైనా శిక్షార్హులేనని స్పష్టం చేశారు.