
హైదరాబాద్,వెలుగు : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీ స్కీమ్స్‌లో భాగంగా కొత్త రేషన్ కార్డుల అప్లికేషన్ల స్వీకరణకు సమయం ఆసన్నమైంది. ఇందుకు అవసరమైన మార్గదర్శకాలను గురువారం ప్రభుత్వం ప్రకటించే చాన్స్ ఉంది. నేటి నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు ప్రజా పాలన నిర్వహిస్తుండగా ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అనంతరం జంటనగరాల్లో కొత్త రేషన్‌కార్డులను ఎలా జారీ చేయాలనే దానిపై చర్చిస్తారు.
ఈసారి రేషన్ కార్డుల జారీలో అనేక మార్పులు ఉండనున్నట్లు సమాచారం. ప్రస్తుతం కార్డులు ఉన్న వారిలో కూడా మార్పులు ఉండొచ్చు. ముఖ్యంగా కార్డుదారులు ఇన్ కమ్ సర్టిఫికెట్ ఇవ్వాలనే నిబంధన కోరనున్నట్టు తెలిసింది. పాత కార్డులో ఏమైనా తప్పు లుంటే సరి చేసుకోవాలని కూడా కొత్త మార్గదర్శ కాల్లో ప్రభుత్వం పేర్కొనవచ్చని సివిల్ సప్లై ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.
మీ సేవ సెంటర్లలో అప్లికేషన్లు
సిటీలో మీసేవ ద్వారానే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధిత ప్రకటన, మార్గదర్శకాలు వెలువడగానే ప్రక్రియను ప్రారంభిస్తారు. ఈసారి ఇన్‌కం సర్టిఫికెట్, ఆధార్, నివాస ధృవీకరణ, గృహ యజమాని చేసే జాబ్, కులం తదితర వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. మీసేవ సెంటర్లలో దరఖాస్తు చేసుకున్న తర్వాత సంబంధిత సర్కిళ్ల ఏఎస్ ఓ పరిధిలోని దరఖాస్తుదారుల ఇళ్లకు అధికారులను పంపించి విచారణ జరిపిన తర్వాతనే కొత్త కార్డులను జారీ చేస్తారని అధికారి తెలిపారు.
పెండింగ్ అప్లికేషన్ల పరిశీలన తర్వాత..
రేషన్ కార్డులకు మార్గదర్శకాలు రాగానే సిటీలోనూ పెద్దసంఖ్యలో అప్లికేషన్లు వస్తాయని అధికారులు భావిస్తున్నారు. హైదరాబాద్ సిటీలోని 9 సర్కిళ్ల పరిధిలో 600 రేషన్ షాపులు, దాదాపు 4.20లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల్లో 85 వేల వరకు ఉన్నట్లు సమాచారం. ుందుగా పెండింగ్ అప్లికేషన్లను పరిశీలించి కేటాయిస్తారని, ఆ తర్వాత కొత్త అప్లికేషన్లు స్వీకరించే చాన్స్ ఉన్నట్లు సమాచారం.
ఈసారి జారీ చేసే రేషన్‌కార్డులను పకడ్బందీగా పరిశీలన చేయాలని అధికారులకు ఆదేశాలు వచ్చాయి. ప్రస్తుతం రేషన్ కార్డుల ద్వారా బియ్యం, గోధుమలు ఇస్తున్నారు. కొత్తగా జారీ చేసే రేషన్‌కార్డులో మరిన్ని వస్తువులను కలిపి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.