తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో మరో చిరుత సంచారం

 తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో మరో చిరుత సంచారం

తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో మరో చిరుత సంచారం కలకలం రేపుతోంది. ఘాట్ రోడ్డు15వ మలుపు వద్ద చిరుత పులి వాహనదారుల కంటపడింది. వెంటనే టీటీడీ అధికారులకు వాహనదారులు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్ చిరుత ఆచూకీ సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఈ మధ్య చిరుతల సంచారం తిరుమలలో ఎక్కవైంది. కాలినడకన వెళ్తున్న భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

తిరుమల నడక మార్గంలో చిక్కిన చిరుతల్లో రెండింటిని అధికారులు సోమవారం (సెప్టెంబర్ 18న) విడిచిపెట్టారు. తిరుమలలో గత నెలలో చిన్నారి లక్షితపై చిరుత దాడి తర్వాత ఏర్పాటు చేసిన బోనులో నాలుగు చిరుతలు చిక్కాయి. వాటిలో రెండు చిరుతలు చిన్నారిపై దాడి చేసినవి కాదని వైద్య పరీక్షల్లో నిర్ధారించారు. ఒక చిరుతకు పూర్తిగా దాడి చేసి చంపే స్థాయిలో దంతాలు ఎదగకపోవడం, మరొకటి నెలల కూనగా గుర్తించారు. దీంతో  నివేదిక ప్రకారం అటవీశాఖ బంధించిన రెండు చిరుతలను విడిచిపెట్టామని అధికారులు వెల్లడించారు.

తిరుమలలో మెట్ల మార్గంలో ఇప్పటి వరకు ఐదు చిరుతలను బంధించారు అధికారులు. మొదట బంధించిన చిరుతను వెంటనే అటవీ ప్రాంతంలో వదిలేశారు. ఆగష్టు 11న ఆరేళ్ల లక్షితపై చిరుత దాడి చేయడంతో చిరుతల్ని బంధించేందుకు టీటీడీ, అటవీశాఖ ఆపరేషన్ చిరుత ప్రారంభించారు. ఇప్పటి వరకు ఐదు చిరుతలను అటవీ శాఖ అధికారులు బంధించారు. శేషాచలం అటవీ ప్రాంతంలో దాదాపు 45 చిరుతలు ఉన్నాయని అటవీ శాఖ లెక్కలు చెబుతున్నాయి. వీటిలో కొన్ని మాత్రమే తిరుమల మెట్ల మార్గానికి సమీపంలోకి వస్తున్నాయని వివరించారు. చిన్నారి లక్షితపై దాడి చేసిన చంపేసిన తర్వాత అలిపిరి మార్గంలో 200 కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటిలో చిరుతల కదలికలను అధికారులు గుర్తిస్తున్నారు.