అడవిలోనే బిడ్డకు జన్మ

అడవిలోనే బిడ్డకు జన్మ

తండా అంటే ఇప్పటికీ చిన్నచూపే.. విద్య, వైద్య సదుపాయాలు లేవు.. కనీసం సరైన రోడ్డు ఉండదు.. రవాణా సౌకర్యం ఉండదు.. ఏ కష్టమొచ్చినా పట్నానికి రావాలంటే నానా యాతన పడాలి.. ఇక పురిటి నొప్పులు వచ్చాయంటే.. దారి మధ్యలోనే పురుడు అవుతుందనే సామెతను నిజం చేస్తూ.. ఓ ఘటన జరిగింది. అడవి తల్లిని నమ్ముకుని బతికే ఆ గిరిజనులకు..ఆ పుడమి.. తల్లిగా పురుడు పోసి.. పండంటి బిడ్డను చేతిలో పెట్టింది.  ఈ దయనీయ సంఘటన ఏపీలోని అల్లూరి జిల్లాలో చోటుచేసుకుంది. చింతపల్లిమండలం పాలమామిడి గ్రామానికి చెందిన  దేవి(22) అనే యవతి పురిటీ నొప్పులతో బాధపడుతుంది. దీంతో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లడానికి రహదారి సౌకర్యం లేదు. దీంతో ఆ కుటుంబ సభ్యులు ఆమెను అటవీ ప్రాంతం మీదుగా ఆసుపత్రికి తీసుకు వెళ్తుండగా మార్గమధ్యలో ప్రసవించి  పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దేవుడి దయవల్ల తల్లి, బిడ్డ క్షేమంగానే ఉన్నారు. అయితే  ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా ఉండేందుకు తమ గ్రామానికి సరైన రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.