సెల్ ఫోన్‭కు అలవాటై చదువు మానేసిన పిల్లవాడు

సెల్ ఫోన్‭కు అలవాటై చదువు మానేసిన పిల్లవాడు

రమేష్ చురుకైన స్టూడెంట్​.  గ్రామంలో ఉన్న గవర్నమెంట్ స్కూల్​లో ఏడో తరగతి చదువుతున్నాడు. కరోనా వల్ల పిల్లలందరికీ ఆన్​లైన్ తరగతులు జరుగుతున్నాయి. కాబట్టి తప్పనిసరిగా పిల్లలకు సెల్​ఫోన్​ కొనివ్వమని తల్లిదండ్రులకు ఆ స్కూల్​ టీచర్లు చెప్పారు. రమేష్​కి పదివేలు పెట్టి సెల్​ఫోన్​ కొనిచ్చారు వాళ్ల అమ్మానాన్న. రమేష్ రోజూ ఆన్​ లైన్​ క్లాసులు వినేవాడు. ఎప్పటికప్పుడు హోంవర్క్ పూర్తి చేసేవాడు.కొద్దిరోజుల తర్వాత రమేష్ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. ఎప్పుడూ సెల్​ఫోన్​తో రకరకాల ఆటలు ఆడడం, స్నేహితులతో ఫోన్​లో మాట్లాడడం, ఇలా ఒక్క క్షణం కూడా సెల్​ఫోన్​కి దూరంగా ఉండలేకపోయేవాడు. రాత్రి పూట సరిగా నిద్రపోయేవాడు కాదు. రమేష్​కి రానురాను చిరాకు, కోపం, అసహనం ఎక్కువైపోయాయి. కంట్లో నుండి నీరు కారడం మొదలైంది. అది గమనించిన తల్లిదండ్రులు రమేష్​ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. డాక్టర్ అన్ని రకాల పరీక్షలు, చేసి తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పాడు.

‘‘మీ కొడుక్కి కంటికి సంబంధించిన సమస్య ఎక్కువగా ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు సెల్ ఫోన్​కు దూరంగా ఉంచండి. రాత్రి పూట సరిగ్గా నిద్రపోయేలా చూడండి. లేకపోతే పూర్తిగా కంటి చూపు పోయే ప్రమాదం ఉంది’’ అని జాగ్రత్తలు చెప్పి, కొన్ని మందులు ఇచ్చాడు డాక్టర్. ‘సరే’నని తల్లిదండ్రులు రమేష్​ని తీసుకుని ఇంటికి వెళ్లారు.కానీ, తన ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. ఇంకా సెల్​ఫోన్ వాడటం ఎక్కువైంది. తల్లిదండ్రుల మాట వినేవాడు కాదు. రోజురోజుకీ అతనికి కంటి చూపు తగ్గిపోతోంది. వస్తువులు, అక్షరాలు సరిగా కనబడడం లేదు. తల్లిదండ్రులు భయపడి పట్నంలోని పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్ కంటి ఆపరేషన్ చేయాలని చెప్పాడు. ఆపరేషన్ తర్వాత అతనికి చూపు ఎప్పటిలాగా వచ్చింది. అప్పుడు రమేష్​ తల్లిదండ్రులను చూసి ‘‘సారీ.. ఇంకెప్పుడూ సెల్​ఫోన్​లో ఆడను. అవసరం ఉంటేనే ఫోన్ ముట్టుకుంటా. ఫోన్​ వాడితే మీరు కూడా నాలాగే అయిపోతారు అని నా దోస్తులకు చెప్తా’’ అన్నాడు. రమేష్​లో వచ్చిన మార్పుకు తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు.

- కె.ప్రసన్న , 10వ తరగతి