పుట్ పాత్ లే... ట్యూషన్ వేదికలుగా

పుట్ పాత్ లే... ట్యూషన్ వేదికలుగా

ప్రస్తుత రోజుల్లో మనకి అవతలివాళ్లు ఏం ఇస్తారు.. ఏం చేస్తారు... అని అనే వాళ్లే గానీ.. మనం సమాజానికి ఎంత వరకు సాయపడుతున్నాం, ఏం చేస్తున్నాం అని ఆలోచించేవాళ్లు చాలా అరుదు. అలా చేసేవాళ్లు ఉన్నా కూడా కొందరు పేరు కోసమో, గొప్పలు చెప్పుకోవడానికో.. అదీ కాదంటే దాని వల్ల ఇంకేమైనా ఫలితం ఆశించో చేసే వాళ్లే ఎక్కువ. కానీ ఎలాంటి ఫలితమూ ఆశించకుండా.. తనకున్న సమయంలోనే పలువురికి సాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు ఓ సివిల్ ఇంజినీర్. 

గుజరాత్ లోని వడోదరలో నికుంజ్ త్రివేది అనే ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి... దాదాపు 95 నుంచి 100 మంది పిల్లలకు ఉచితంగా విద్యనందిస్తున్నారు. అది కూడా ఫుట్ పాత్ పైన. స్థలం ఏదైనా సరే... చదువుకోవాలన్న పట్టుదల, జీవితంలో ఏదైనా సాధించాలన్న తపన ఉంటే.. ఏదైనా సాధ్యమేనన్న పదానికి ఉదాహరణగా నిలుస్తాడు నికుంజ్. ఇక్కడ చదువుకోవడానికి వచ్చే పిల్లల్లో కేజీ నుంచి పదో తరగతి వరకు ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలుంటారని, కానీ వారి తల్లిదండ్రులకు ట్యూషన్ చెప్పించే స్థోమత లేదని.. అందుకే వాళ్లకు ఉచితంగా చదువు చెప్తుంటానని నికుంజ్ తెలిపారు. అంతే కాదు అక్కడికి వచ్చే పిల్లల్లో 5 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులకు తాను పాఠాలు చెప్తుంటానని అన్నారు. దీంతో పాటు వాళ్లలో 5,6 విద్యార్థులకు తానే ఫీజులు కడుతున్నానని నికుంజ్ తెలిపారు. చిన్న తరగతి వాళ్లకు బేసిక్స్ నేర్పిస్తానని.. అది వాళ్లకు ఇంగ్లీషు, గుజరాతీ, హిందీ రాయడానికి సాయపడుతుందని వెల్లడించారు. కొంత మంది కూడా తనకు ఈ పనిలో ఆర్థికంగా చాలా సహాయం చేస్తుంటారని నికుంజ్ చెప్పారు. తాను ఇంతకుముందు బోధించిన విద్యార్థులు కూడా తనకు టీచింగ్ లో సహాయంగా ఉంటారని ఆయన స్పష్టం చేశారు.