V6 News

మహిళా రిజర్వేషన్లతో.. పార్లమెంటులో సమానత్వం!

మహిళా రిజర్వేషన్లతో.. పార్లమెంటులో సమానత్వం!

ప్రధాని నరేంద్ర మోదీ మహిళా రిజర్వేషన్ల అమలుపై రాసిన వ్యాసం ద్వారా.. 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి రాజ్యాంగ (నూట ఆరవ సవరణ) చట్టం, 2023 అమలును వేగవంతం చేసేందుకు ఏప్రిల్ 16న పార్లమెంటు సమావేశమవుతున్నదని ప్రకటించారు. ఈ చట్టం లోక్‌సభ, రాష్ట్ర  శాసనసభల్లో  మహిళలకు 33%  రిజర్వేషన్లను తప్పనిసరి చేస్తోంది. పాలనలో మహిళా నాయకత్వాన్ని బలోపేతం చేయడంలో ప్రధాని పేర్కొన్నట్లు ఇది చరిత్రాత్మక  స‍ందర్భం. 

లోక్‌సభ  స్థానాలను 816కు పెంచుతారని అంచనా వేస్తుండగా, దీనివల్ల మహిళా ప్రాతినిధ్యం ప్రస్తుతమున్న 74 (13.6%) నుంచి 273 (33%)కు పెరుగుతుంది. రాష్ట్రస్థాయిలో, అసెంబ్లీ స్థానాల సంఖ్యను 3,997 నుంచి దాదాపు 6,000కు పెంచితే,  ప్రస్తుతం ఉన్న కేవలం 390 మంది మహిళా శాసనసభ్యుల స్థానంలో దాదాపు 2,000 మంది అవసరం అవుతారు.  ప్రపంచవ్యాప్తంగా జాతీయ పార్లమెంట్లలో మహిళల ప్రాతినిధ్యం 27.2%  మాత్రమే ఉంది.  ఇప్పుడు  ఈ  సగటును అధిగమించే  అవకాశం భారతదేశానికి వస్తుంది.

భారతదేశంలో జరగబోయే ఈ భారీ మార్పు తక్షణమే ఒక 'నాయకత్వ శూన్యత'ను  సృష్టిస్తుంది. ఇంత భారీ సంఖ్యలో మహిళా నేతలు ఎక్కడి నుంచి వస్తారు?   ప్రస్తుత పార్లమెంటరీ ఎంపిక విధానం పాలనా అనుభవం కంటే  కుల సమీకరణాలు,  ధనబలం మీదే ఎక్కువగా ఆధారపడి ఉంది.  ఎన్నడూ  ఒక ప్రభుత్వ సంస్థను  నిర్వహించని,  సంక్షేమ పథకాన్ని  పర్యవేక్షించని వ్యక్తులు  ప్రజాప్రతినిధులుగా  ఎన్నికవుతున్నారు.  దీని ఫలితంగా- చట్టాలను  అమలుచేసిన అనుభవంలేనివారే చట్టాలు చేస్తున్నారు.  ప్రభుత్వ  నిధులను  ఏనాడూ  నిర్వహించనివారు బడ్జెట్‌లపై  ఓటు వేస్తున్నారు.  అయితే,  గత మూడు దశాబ్దాలుగా  భారతదేశంలో  ప్రతిభావంతులను  తీర్చిదిద్దుతున్నది  పంచాయతీరాజ్ వ్యవస్థ. 

 మహిళా నాయకత్వ శక్తి
 రాజ్యాంగ (డెబ్భై మూడవ సవరణ) చట్టం, 1992 ప్రకారం.. భారతదేశంలోని 2.68 లక్షల గ్రామ పంచాయతీలు,  గ్రామీణ సంస్థల్లో  ప్రస్తుతం 14 లక్షల మందికి పైగా  ఎన్నికైన  మహిళా  ప్రతినిధులు ఉన్నారు. ఈ సర్పంచులు, మండలాధ్యక్షులు,  జిల్లా పరిషత్  చైర్‌పర్సన్‌లు  ప్రస్తుతం  స్థానిక ప్రతినిధులందరిలో 46% ఉన్నారు.  తదుపరి తరం ఎంపీలు, ఎమ్మెల్యేలను  తయారు చేయడానికి వీరు సరైన జట్టు.   ఎందుకంటే  పాలనలో వారికి నిరూపితమైన అనుభవం ఉంది.   తెలంగాణలో అనంతోగులో మహిళల  నేతృత్వంలో  మద్యపాన నిషేధం,  ఉత్తరప్రదేశ్‌లోని  లతీఫ్‌పూర్‌లో  వరకట్నరహిత వివాహాలు,  కేరళలోని మట్టూల్ డ్రగ్స్ నిర్మూలన,  మహారాష్ట్రలోని  కొల్హాపూర్‌లో వితంతువులను  అవమానించే  దురాచారాల  నిర్మూలన,  రాజ్‌పూర్‌లో  మహిళా సర్పంచ్  చొరవతో  ప్లాస్టిక్ రహిత గ్రామం వంటివి మహిళా నాయకత్వ పటిమకు  నిదర్శనాలు.

జాతీయ స్థాయికి మార్గదర్శకత్వం అందించాలి
స్థానిక సంస్థల్లో తమ పాలనాపటిమను  నిరూపించుకున్న మహిళా నేతలకు  జాతీయ స్థాయికి ఎదగడానికి చురుగ్గా శిక్షణ, మార్గదర్శకత్వం అందించాలి. స్వతంత్ర  మహిళా నేతలకు మద్దతు ఇవ్వకపోతే, ఆ స్థానాలను  రాజకీయ కుటుంబాలు, వ్యాపార వర్గాలు  తమ ప్రాక్సీ అభ్యర్థులతో  భర్తీ చేసే ప్రమాదం ఉంది. దీనిని నివారించడానికి  క్షేత్రస్థాయి మహిళా నేతలకు పబ్లిక్ లీడర్‌షిప్, శాసన సభా వ్యవహారాలు, చర్చల నైపుణ్యం, మీడియాతో  వ్యవహరించే విధానంపై  సమగ్ర శిక్షణ అవసరం.  క్షేత్రస్థాయి నేతలను అనుభవజ్ఞులైన శాసనసభ్యులతో  అనుసంధానించే  మెంటార్‌షిప్  నెట్‌వర్క్​లను ఏర్పాటు చేయాలి. 

అర్జెంటీనా 1991లోనే ‘లే డి క్యూపోస్’ ద్వారా మహిళా కోటాను చట్టబద్ధం చేసిన మొదటి దేశం. అయితే రాజకీయ పార్టీలు మహిళలను గెలవలేని స్థానాల్లో నిలబెట్టడంతో ఆ చట్టం ద్వారా సాధించిన  ప్రారంభ  ప్రయోజనాలు ఆవిరయ్యాయి. - ఈ విధానాన్ని ఆ తర్వాత ఎన్నికల ఛాంబర్ నిషేధించాల్సి  వచ్చింది.  మెక్సికో 'పారిడాడ్ ఎన్ టోడో' (అన్నింటా సమానత్వం) కార్యనిర్వాహక,  న్యాయవ్యవస్థల్లో సమానత్వాన్ని కల్పించింది. మెక్సికోలో  ప్రస్తుతం 20-–40%  మహిళా న్యాయమూర్తులు ఉన్నారు.  అక్కడి  సుప్రీంకోర్టులో  మహిళలదే  మెజారిటీ (9 స్థానాలకుగాను 5 స్థానాలు). భారత సుప్రీంకోర్టులో 34 మంది  న్యాయమూర్తులలో  కేవలం  ఒక్క మహిళ మాత్రమే ఉన్నారు.

మహిళల్లో నాయకత్వ లక్షణాలు ప్రోత్సహించాలి
రువాండా 61 శాతానికి పైగా పార్లమెంటరీ స్థానాల్లో మహిళా ప్రాతినిధ్యంతో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. నాయకత్వ లక్షణాలు ఉన్న మహిళలను గుర్తించి ప్రోత్సహించాలి. శిక్షణ ఇచ్చి,  మార్గనిర్దేశం చేసే 'నేషనల్ ఉమెన్స్ కౌన్సిల్' వల్ల మహిళలు వార్డుస్థాయిలో పాలనా అనుభవాన్ని గడించి  క్రమంగా ఉన్నతంగా  ఎదుగుతారు. - దీనివల్ల రిజర్వు చేసిన స్థానాలు రాజకీయ కుటుంబాల ప్రాక్సీలతో కాకుండా, నిజమైన పౌర భాగస్వామ్యం ఉన్న  మహిళలతో  భర్తీ అవుతాయి.  బొలీవియా కూడా  స్థానిక మహిళల  నాయకత్వ  నెట్‌వర్క్​లో దృష్టి పెట్టిన తర్వాత మాత్రమే  సమానత్వాన్ని  సాధించగలిగింది.  ఎలాంటి అధికారిక  రిజర్వేషన్  చట్టాలు లేకుండానే,   స్వీడన్ ‘జిప్పర్ విధానం’ పార్టీ జాబితాల్లో  పురుష, మహిళా  అభ్యర్థులను  ఒకరి తర్వాత ఒకరిని నిలబెడుతున్నది.

బలమైన  అంతర్గత  మహిళా సమాఖ్యల మద్దతుతో,  స్వీడన్ పార్లమెంటు (రిక్స్​డాగ్)లో మహిళలు 45%కి పైగా స్థానాలను దక్కించుకుంటున్నారు.  ఐర్లాండ్‌లో  ‘ఉమెన్ ఫర్ ఎలక్షన్’ వంటి  ఎన్జీవోలు  మహిళలు  పోటీ చేయకుండా అడ్డుకునే ఐదు ‘సి’లను - క్యాష్ (నగదు),  చైల్డ్ కేర్  (పిల్లల సంరక్షణ),  కాన్ఫిడెన్స్ (ఆత్మవిశ్వాసం), కల్చర్ (సంస్కృతి), కాండిడేట్ సెలక్షన్ (అభ్యర్థి ఎంపిక) - తొలగించడానికి  ప్రయత్నించాయి.  కొన్ని అపజయాలూ  ఉన్నాయి.  జోర్డాన్‌లో రిజర్వ్ చేసిన స్థానాలు  కొన్నేళ్లపాటు రాజకీయ కుటుంబాలకు  చెందిన మహిళల ఆధిపత్యంలోనే ఉండిపోయాయి.  ఇది ఉన్నత వర్గాల ఆధిపత్యాన్ని మాత్రమే కొనసాగించింది.

పంచాయతీ నుంచి పార్లమెంటుకు.. 

భారతదేశం ముంగిట..  రువాండా లాంటి నాయకత్వ వ్యవస్థ,  జోర్డాన్  ఎదుర్కొన్న ప్రమాదం,  ఐర్లాండ్ చూసిన అడ్డంకులు - ఈ మూడూ ఉన్నాయి.  2029 నాటికి ఈ మూడింటి నుంచి మనం పాఠాలు నేర్చుకుంటామా లేదా అన్నదే అసలు ప్రశ్న.  ఆశాజనకమైన విషయం ఏమిటంటే.. పంచాయతీ నుంచి పార్లమెంటుకు  రాజకీయ ప్రస్థానం సాధ్యమేనని  ఇప్పటికే  రుజువైంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒక గ్రామ పంచాయతీ నుంచి ఎదిగి భారత రాష్ట్రపతి అయ్యారు.  కేంద్ర మంత్రి  సావిత్రి ఠాకూర్ జిల్లా పంచాయతీ నుంచి  ప్రస్థానం  ప్రారంభమయ్యారు.

రక్షా నిఖిల్ ఖడ్సే జాతీయ కేబినెట్‌లో చేరడానికి ముందు  గ్రామ సర్పంచ్‌గా  పనిచేశారు.  సమీప  భవిష్యత్తులో  ఇలాంటి మరెన్నో  విజయగాథలు  లిఖించవచ్చు. హైకోర్టు ధర్మాసనాలను  ఎలా  ఏర్పాటు  చేస్తుందో  గమనించాలి.  మూడింట  రెండొంతుల మంది  న్యాయమూర్తులను బార్ నుంచి (న్యాయవాదుల నుంచి) నియమిస్తే,  ఒక వంతు మందిని కింది స్థాయి  కోర్టుల  నుంచి ప్రమోట్ చేస్తారు.  ఈ రెండు మార్గాలూ అవసరమైనవి.  

పాలనలో తెలుగు భాషను ప్రోత్సహించాలి

1951 ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సవరణ చేయడం ద్వారా.. స్థానిక సంస్థల్లో ఎన్నికై  పూర్తి పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులు (మహిళలు, పురుషులు) మాత్రమే  పోటీ చేసేలా పార్లమెంటరీ, అసెంబ్లీ స్థానాల్లో కొంత కోటా  అవసరం.  అదనంగా  క్షేత్రస్థాయి అభ్యర్థులకు మద్దతు ఇవ్వడానికి  స్వీడన్  ‘పబ్లిక్ ఫైనాన్స్డ్ ఎలక్షన్  సిస్టమ్’ తరహాలో చట్టబద్ధమైన 'ఎన్నికల సాధికారత నిధి' ఉండాలి. స్వీడన్‌  'పార్టిస్టోడ్'  మునిసిపల్, కౌంటీ స్థాయిల్లో  కూడా  ప్రచార నిధులను  అందిస్తుంది.  మరోపక్క చట్టాలు, ఉత్తర్వులు, దస్త్రాలు ఆంగ్లంలోనే  ఉండటం  కూడా - సామర్థ్యం,  పట్టుదల ఉన్న  గ్రామీణ నేతలు ఉన్నతస్థాయికి  ఎదగకపోవడానికి అడ్డంకిగా మారుతోంది. అధికార భాషా చట్టం, 1966  ప్రకారం  పాలనలో  తెలుగు భాషను ప్రోత్సహించేందుకు  కృషి  జరగాలి. 

శ్రీనివాస్ మాధవ్, ‘51A అభీ ఫౌండేషన్’ వ్యవస్థాపకుడు

* ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ​ఐడీ openpage@v6velugu.com

* రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.

* స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.