సింగరేణి ఎన్నికలపై ఆర్ఎల్సీ మీటింగ్ నేడు

సింగరేణి ఎన్నికలపై ఆర్ఎల్సీ మీటింగ్ నేడు

32 కార్మిక సంఘాలకు పిలుపు

కోల్​బెల్ట్, వెలుగు : తెలంగాణ ఆరు జిల్లాల్లో 16 అసెంబ్లీ, 4 పార్లమెంట్ నియోజకవర్గాల్లోని ఓటర్లను ప్రభావితం చేసే సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల నిర్వహణపై సోమవారం కీలకమైన మీటింగ్ ​జరగనుంది. 43 వేల మంది సింగరేణి ఓటర్ల నిర్ణయం రానున్న  సాధారణ ఎన్నికల్లో అభ్యర్థుల భవితవ్యంపై ప్రభావం చూపనుండడంతో ఈ మీటింగ్​పై కార్మికులు, కార్మిక సంఘాలు ఆసక్తి చూపుతున్నాయి.  హైదరాబాద్​లోని రీజనల్ లేబర్ కమిషనర్(ఆర్ఎల్సీ) ఆఫీస్ లో 32 కార్మిక సంఘాల ప్రతినిధులు, సింగరేణి యాజమాన్యంతో కమిషనర్ చర్చించనున్నారు. 2017 అక్టోబర్ 5న జరిగిన ఆరో దఫా గుర్తింపు సంఘం ఎన్నికల తర్వాత మళ్లీ ఎన్నికలు నిర్వహించలేదు. తాజాగా ఆర్ఎల్సీ సమక్షంలో కీలక మీటింగ్ జరుగనుంది. ఇప్పటికే కేంద్ర కార్మికశాఖ డిప్యూటీ చీఫ్ రీజనల్ లేబర్ కమిషనర్ శ్రీనివాసరావును ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా నియమించింది. సోమవారం జరిగే మీటింగ్​లో ఎన్నికల తేదీని ప్రకటించే చాన్స్ ఉంది. ఆర్ఎల్సీ సమక్షంలో జరిగే మీటింగ్​లో ఎన్నికల మార్గదర్శకాల మార్పుపై కొన్ని కార్మిక సంఘాలు చర్చించేందుకు రెడీ అవుతున్నాయి. 1998 జూన్ 9న తొలి గుర్తింపు సంఘం ఎన్నికల మార్గదర్శకాలనే నేటికీ కొనసాగిస్తున్నారు. గుర్తింపు కాలపరిమితిపై తరచూ వివాదాలు చోటుచేసుకోవడంతో కోల్​బెల్ట్​లో పారిశ్రామిక సంబంధాలపై ప్రభావం పడుతోంది. సంఘాల మధ్య కాలపరిమితి వ్యవహారంపై గొడవలు జరుగుతున్నాయి.  దాంతో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్గదర్శకాల్లో మార్పు చేసుకోవాలని కార్మిక సంఘాలు భావిస్తున్నాయి.

రెండు ఓట్ల విధానం.. కాలపరిమితిపై పట్టు

తొలి గుర్తింపు సంఘం ఎన్నికల సమయంలో కుదుర్చుకున్న కోడ్ ఆఫ్ డిసిప్లేన్​లో మార్పులు చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఎన్నికల్లో ఒకే ఓటు వేయాల్సి ఉండటంతో కార్పొరేట్, డివిజన్(ఏరియా) స్థాయిలో ఎన్నుకునే సంఘాలకు చాన్స్ లేకుండా పోతోందని లీడర్లు పేర్కొంటున్నారు. సింగరేణిలో రెండు ఓట్ల విధానాన్ని అమలు చేయాలని తరచూ డిమాండ్ వస్తోంది. డివిజన్ స్థాయిలో ఎన్నుకోవడానికి ఒక ఓటు, కార్పొరేట్ స్థాయిలో గుర్తింపు కోసం మరో ఓటు వేయడం ద్వారా కార్మికులు స్పష్టంగా నిర్ణయాలు తీసుకునే చాన్స్ ఉంటుందని పలు కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న విధానంలో ఒకే ఓటు వేయడం ద్వారా మొత్తం ఓట్లలో ఎక్కువ పొందినవారిని గుర్తింపు స్థాయి, డివిజన్​లో ఎక్కువ ఓట్లు వచ్చిన సంఘాన్ని ప్రాతినిధ్య సంఘంగా నిర్ణయిస్తున్నారు. దీని వల్ల  కొన్ని సంఘాలకు ప్రయారిటీ లేకుండా పోతోంది. సింగరేణి స్థాయిలో గుర్తింపు కోసం ఒక ఓటు, డివిజన్ల వారీగా ప్రాతినిధ్య సంఘాలను ఎన్నుకోవడానికి మరో ఓటు వేసే అవకాశం కల్పించాలని కార్మిక సంఘాలు కోరనున్నాయి. ఎక్కువ ఓట్లు సాధించిన సంఘానికి గుర్తింపు హోదా కల్పిస్తూనే కొంత శాతం సాధించిన సంఘానికి సింగరేణి యాజమాన్యం వద్ద కార్మికుల సమస్యలపై చర్చించే చాన్స్​ఇవ్వాలని కోరనున్నాయి.  మరోవైపు మొదటి రెండు ఎన్నికలు రెండేళ్ల కాలపరిమితితో నిర్వహించారు. 2017 ఎన్నికల్లో ముందుగా నాలుగేళ్ల కాలపరిమితి నిర్ణయించి రిజల్ట్ అనంతరం రెండేళ్లంటూ ఆదేశాలు జారీ చేశారు. 

రాష్ట్ర సర్కార్ సానుకూలంగా స్పందిస్తేనే..

గుర్తింపు ఎన్నికల నిర్వహణ రాష్ట్ర సర్కార్ నిర్ణయంపై ఆధారపడి ఉంది. కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వ శాఖల సమన్వయంతో వీటిని నిర్వహించాల్సి ఉంటుంది. ఎన్నికల బందోబస్తు, ఓట్ల లెక్కింపునకు పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, ప్రభుత్వ టీచర్లు ఎక్కువ సంఖ్యలో అవసరముంటుంది. వారిని సమకూర్చాల్సిన బాధ్యత రాష్ట్ర సర్కారుపై ఉండటంతో ప్రభుత్వ నుంచి సానుకూల స్పందన రావాల్సి ఉంది. అప్పుడే కేంద్ర కార్మికశాఖ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ చేపట్టే వీలుంటుంది.