ధాన్యం బస్తాల పక్కనే ఆగిన రైతు గుండె

ధాన్యం బస్తాల పక్కనే  ఆగిన రైతు గుండె

ధాన్యం ఆరబెట్టే కల్లం వద్ద హార్ట్ ​ఎటాక్తో కుప్పకూలిండు
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం 
మండలం వేములకుర్తిలో విషాదం

మెట్ పల్లి, వెలుగు: పంట కోసం రేయింబవళ్లు శ్రమించాడు. తెగుళ్లతో ఇబ్బందులు పడ్డా మందులు పిచికారీ చేసి పంటను కాపాడుకున్నాడు. వచ్చిన దిగుబడి అమ్ముకుందామనుకునే క్రమంలో ప్రాణాలే పోయాయి. పంట తేమ శాతం తగ్గించే క్రమంలో కల్లంలోనే గుండెపోటుతో చనిపోయాడు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తికి చెందిన ఆకుల రాజారాం (57) కు రెండెకరాల పొలం ఉంది. ఖరీఫ్ లో సీడ్ ధాన్యాన్ని పండించాడు.

గుబడిని యామపుర్, - వేములకుర్తి శివారులోని హైలెవెల్​ వంతెన పక్కన ఉన్న రోడ్డుపై కల్లం ఏర్పాటు చేసి ఐదు రోజుల నుంచి ధాన్యం ఆరబెట్టుకున్నాడు. రోజూ ఉదయం కల్లం దగ్గరకు వెళ్లి ధాన్యం ఆరబెట్టుకుని సాయంత్రం సంచుల్లో నింపుకుని ఇంటికి వచ్చేవాడు. తేమ శాతం తగ్గడంతో రెండు, మూడు రోజుల్లో పంట అమ్ముకుందామని అనుకున్నాడు. సీడ్ వ్యాపారికి కూడా సమాచారం ఇచ్చాడు.

శుక్రవారం సాయంత్రం కల్లంలోని ధాన్యాన్ని సంచుల్లో నింపి వాటిని కుట్టే క్రమంలో గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. గ్రామస్తులు, రైతులు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చి మృతదేహాన్ని ఇంటికి తరలించారు. రాజారాంకు కొడుకు, కూతురు ఉన్నారు. భార్య కొన్ని సంవత్సరాల క్రితమే చనిపోయింది.