కలెక్టరేట్​ ఎదుట పురుగుల మందు తాగిన రైతు

కలెక్టరేట్​ ఎదుట పురుగుల మందు తాగిన రైతు
  • భూ సమస్య పరిష్కరిస్తలేరని ఆత్మహత్యాయత్నం 
  • గ్రీవెన్స్​కు పోతే పీఎస్​కు పొమ్మన్నరు
  • పీఎస్​కు పోతే కొడతమన్నరు  
  • దవాఖానాకు తరలించిన అడిషనల్ ​కలెక్టర్​
  • ఎంక్వైరీకి ఆదేశం

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: పోలీసుల అండతో తన భూమిని తన అన్న గుంజుకున్నాడని, న్యాయం చేయాలని కొత్తగూడెం కలెక్టరేట్​ఎదుట ఓ రైతు సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులకు కంప్లయింట్​ఇస్తే పట్టించుకోవడం లేదని, కలెక్టరేట్​కు వస్తే పీఎస్​కు వెళ్లి కంప్లయింట్​ఇవ్వాలని చెబుతున్నారని వాపోయాడు. బాధితుడి కథనం ప్రకారం...జూలూరుపాడు మండలం కొత్తూరుకు చెందిన గొల్లపూడి శ్రీనివాసరావుకు గ్రామంలో ఆరెకరాల భూమి ఉంది. ఆయన పొలం పక్కనే అతడి అన్న శ్యాంసుందర్​కు భూమి ఉంది. ఇందులో బోరు పడకపోవడంతో తమ్ముడికి చెందిన నాలుగెకరాలు ఆక్రమించుకోవాలని ప్లాన్​చేశాడు. కొంతమంది దళితులకు ఆ పొలాన్ని సాగు చేసుకోవాలని కౌలుకు ఇచ్చాడు. శ్రీనివాసరావు పొలానికి వస్తే శ్యాంసుందర్​అడ్డుకుంటున్నాడు. దీంతో కొన్ని రోజుల కింద జూలూరుపాడు పోలీసులకు కంప్లయింట్​ ఇవ్వబోతే స్పందించలేదు. అక్టోబర్​10న కొత్తగూడెం కలెక్టరేట్​కు వెళ్లి గ్రీవెన్స్​లో కంప్లయింట్​ చేశాడు. కలెక్టర్ అనుదీప్, అడిషనల్​కలెక్టర్ ​వేంకటేశ్వర్లు ఆయన ఇచ్చిన పేపర్లు చూసి, అన్నీ కరెక్ట్​గా ఉన్నాయని పీఎస్​లో కంప్లయింట్​ఇవ్వాలని సూచించారు. సోమవారం పీఎస్​కు వెళ్లగా ‘నువ్వు ఆ భూమిలోకే వెళ్లొద్దు. అది నీ జాగా కాదు. వెళ్తే నీ సంగతి చూస్తా’ అని పోలీసులు బెదిరించారు. సహనం కోల్పోయిన శ్రీనివాస రావు మళ్లీ కలెక్టరేట్​లో​ జరిగిన గ్రీవెన్స్​కు వెళ్లాడు.

నీకు దమ్ము లేదు..పీఎస్​కు పో..

గ్రీవెన్స్​లో ఉన్న అడిషనల్​ కలెక్టర్ ​వేంకటేశ్వర్లును శ్రీనివాసరావు కలిసి విషయం చెప్పాడు. పీఎస్​కు పోతే బెదిరిస్తున్నాడని వాపోయాడు. దీంతో ఆయన ‘నీకు దమ్ము లేదు. నీకు రైతు బంధు వస్తోంది. ఆధారాలన్నీ ఉన్నాయ్​. నువ్వు వెళ్లి పీఎస్​లో కంప్లయింట్​ఇవ్వు. నీ భూమిలోకి నువ్వు పో’ అన్నాడు. దీంతో కలత చెందిన శ్రీనివాస రావు బయటకు వచ్చాడు. గేట్​ముందు నిలబడి ‘పోలీస్​స్టేషన్​కు వెళ్తే కొడతామంటున్నారు. కలెక్టరేట్​కు వస్తే పీఎస్​కు పొమ్మంటున్నారు నేనేం చేసేది’ అంటూ తన క్యారీ బ్యాగ్​లో నుంచి గ్రీవెన్స్​లో ఇచ్చిన రిసిప్ట్​ను కింద పడేశాడు. మరో క్యారీ బ్యాగ్ ​నుంచి పురుగుల మందు డబ్బా తీసి మీద పోసుకున్నాడు. తాగుతుండగా పక్కనున్న వారు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న అడిషనల్​ కలెక్టర్, డీఆర్ఓ అశోక్​ చక్రవర్తి వచ్చి బాధితుడితో మాట్లాడారు. కానిస్టేబుల్​ను ఇచ్చి హాస్పిటల్​కు పంపించారు. దీనిపై ఎంక్వైరీ చేయాలని ఆదేశించడంతో జూలూరుపాడు తహసీల్దార్​ లూథర్​ విల్సన్​  విచారణ మొదలుపెట్టారు. శ్రీనివాసరావు బాగానే ఉన్నాడని కొత్తగూడెం సర్కారు దవాఖానా డాక్టర్లు చెప్పారు.

సివిల్​ మ్యాటర్​ అందుకే..

శ్రీనివాస రావు ఇష్యూ సివిల్ మ్యాటర్​కావడంతో జోక్యం చేసుకోలేదు. రెవెన్యూ ఆఫీసర్​ నుంచి ఆదేశాలొస్తే మేం కేసు పెడతాం. శ్రీనివాసరావును బెదిరించామన్న ఆరోపణల్లో నిజం లేదు.

- శ్రీకాంత్​, ఎస్​ఐ, జూలూరుపాడు