
జగిత్యాల, వెలుగు : జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రాఘవపేటలోని ఓ రైతు తన పొలం పక్కన వినూత్న రీతిలో ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు. సీఎం కేసీఆర్ వరి వేయొద్దని, వేస్తే కొనలేమని చెప్పడంతో రాఘవపేటకు చెందిన సురేందర్ అనే రైతు తనకున్న 8 ఎకరాల్లో ఏ పంట వేయకుండా ఖాళీగా వదిలేశాడు. ఇటీవల మళ్లీ కేసీఆర్వడ్లు కొంటామని ప్రకటన చేయడంతో తాను వరి వేయకుండా నష్టపోయాయనన్న బాధతో ఫ్లెక్సీ పెట్టాడు. అందులో ‘వరి వేస్తే ఉరే అంటివి..రైతులందరిని ఆగం జేస్తివి..ఇప్పుడేమే ప్రతి గింజ కొనుడే అనవడితివి..నీ మాటలు నమ్మి పంట వేయని రైతుల పరిస్థితి ఏంటి? అట్లాంటి రైతులందరికి పరిస్థితి తెలియజేయడానికే ఈ ఫ్లెక్సీ. పక్కన కనిపించే భూమి బీడు భూమి. రైతులతో రాజకీయాలా? మొక్కజొన్న మోసం..సన్నవడ్లు మోసం..షుగర్ ఫ్యాక్టరీ మోసం..పసుపు కొనుగోలు మోసం..తెలంగాణలో రైతు బతుకే మోసం..మోసపోవడం తప్ప మోసం చేయడం చేతకాని ఒకే ఒక్క వ్యక్తి రైతు. జై తెలంగాణ..వరి వేయకుండా మోసపోయిన ఒక రైతు’ అంటూ ముగించాడు. కాగా టీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు సొంత గ్రామంలో ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది.