Pawan Kalyan: 'OG' సక్సెస్ సెలబ్రేషన్: ఒకే ఫ్రేమ్‌లో మెగా హీరోలు! ఫోటోలు చూసి ఫ్యాన్స్ పూనకాలు!

Pawan Kalyan: 'OG' సక్సెస్ సెలబ్రేషన్: ఒకే ఫ్రేమ్‌లో మెగా హీరోలు! ఫోటోలు చూసి ఫ్యాన్స్ పూనకాలు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'OG' చిత్రం విడుదలైన తొలి రోజు నుంచి బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తూ దూసుకెళ్తోంది. అభిమానుల అంచనాలను మించి ఈ  సినిమా విజయనాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషిగా ఉన్నారు.  ఈ ఘన విజయాన్ని పురస్కరించుకొని, హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో లేటెస్ట్ గా ఒక ప్రత్యేక స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శన మెగా కుటుంబానికి దసరా పండుగకు ముందే అరుదైన కలయికగా మారింది.

ఈ ప్రత్యేక ప్రదర్శనకు మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖతో పాటు పవన్ కళ్యాణ్, అకీరా నందన్, ఆద్య,  రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ సహా ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. మెగా కుటుంబం మొత్తం కలిసి సినిమా చూసిన తర్వాత దిగిన గ్రూపు ఫోటోలు ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో అభిమానులు అనందంలో మునిగిపోయారు.

చిరంజీవి ప్రశంసల జల్లు

సినిమా చూసిన అనంతరం చిరంజీవి తన తమ్ముడి నటనపై, సినిమా నిర్మాణ విలువపై ప్రశంసల జల్లు కురిపిస్తూ ట్వీట్ చేశారు. "నా కుటుంబంతో కలిసి #TheyCallHimOG చూశాను. ప్రతి సన్నివేశాన్ని బాగా ఆస్వాదించాం. సరైన భావోద్వేగాలు చెక్కుచెదరకుండా, హాలీవుడ్ ప్రమాణాలకు ఏమాత్రం తీసిపోని విధంగా అద్భుతంగా రూపొందించిన అండర్ వరల్డ్ గ్యాంగ్‌స్టర్ చిత్రం ఇది. ఆది నుంచి అంతం వరకు దర్శకుడు సినిమాను అసాధారణంగా తీర్చిదిద్దారు. @sujeethsignకు అభినందనలు" అని చిరంజీవి పేర్కొన్నారు.

అలాగే, "కళ్యాణ్ బాబును స్క్రీన్‌పై చూసి చాలా గర్వంగా అనిపించింది. తన స్వ్యాగ్‌తో సినిమా స్థాయిని పెంచేశారు. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన పండుగను అందించారు" అని తన తమ్ముడిని పొగిడారు. @MusicThaman సంగీతం, @dop007 అందించిన అద్భుతమైన విజువల్స్, ఎడిటింగ్ మరియు ఆర్ట్ వర్క్‌ను కూడా మెగాస్టార్ ప్రత్యేకంగా ప్రస్తావించారు.

 

బాక్సాఫీస్ వద్ద రికార్డు

'OG' చిత్రం కేవలం అభిమానులనే కాదు, బాక్సాఫీస్‌ను కూడా షేక్ చేసింది. పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే ఇది అతిపెద్ద ఓపెనింగ్స్‌ను నమోదు చేసింది. ప్రీమియర్ షోల నుంచే రికార్డులు సృష్టించిన ఈ సినిమా, విడుదలైన కొద్ది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించింది. పవన్ కళ్యాణ్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది.

'Good Bad Ugly' చిత్రంతో పోలికలపై వివరణ

దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ చిత్రంపై, అజిత్ కుమార్ తదుపరి చిత్రం 'గుడ్ బ్యాడ్ అగ్లీ'తో పోలికలు ఉన్నాయనే చర్చ మొదలైంది. దీనిపై సుజీత్ స్పందిస్తూ... 'OG' ఆలోచన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' స్క్రిప్ట్ రాయడానికి ముందే వచ్చిందని స్పష్టం చేశారు. నేను 'OG' టీజర్ విడుదల చేసిన తర్వాతే  'గుడ్ బ్యాడ్ అగ్లీ'దర్శకుడు అధిక్  స్క్రిప్ట్ రాయడం మొదలుపెట్టారు. కటానా సన్నివేశం వంటి కొన్ని పోలికలు ఉన్నప్పుడు ఈ తరహా తులనలు సహజం. అయితే, ఈ పోలికలు ఒక్కోసారి తప్పుదారి పట్టించే అవకాశం ఉంది అని సుజీత్ వివరణ ఇచ్చారు.

ఇక ఈ మూవీలో ఎమ్రాన్ హష్మి విలన్‌గా తెలుగు తెరకు పరిచయమైన ఈ యాక్షన్ ప్యాక్డ్ డ్రామాలో ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, ప్రియాంక మోహన్, శ్రియా రెడ్డి వంటి అద్భుతమైన నటీనటులు కీలక పాత్రలు పోషించారు. DVV ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు.