పెద్దపల్లి జిల్లాలో భార్యాభర్తల పంచాయితీలో ఘర్షణ.. ఇద్దరు మృతి

పెద్దపల్లి జిల్లాలో భార్యాభర్తల పంచాయితీలో ఘర్షణ.. ఇద్దరు మృతి
  • కత్తులు, రాడ్లతో ఇరు వర్గాల దాడులు
  • పెద్దపల్లి జిల్లాలో ఘోరం

సుల్తానాబాద్, వెలుగు: భార్యాభర్తల మధ్య గొడవ ఇద్దరి మరణానికి కారణమైంది. మంగళవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లి గ్రామంలో ఈ ఘోరం జరిగింది. ఓదెల మండల కేంద్రానికి చెందిన మోటం మారయ్య కుటుంబం వ్యాపారరీత్యా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లిలో స్థిరపడింది. మారయ్య, ఇతని భార్య లక్ష్మి మధ్య మనస్పర్థలు ఏర్పడి కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మారయ్య కుటుంబీకులు, పెద్దపల్లి పట్టణానికి చెందిన లక్ష్మి కుటుంబీకులు సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లి గ్రామంలో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ ఏర్పాటు చేశారు. 

ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య మాటమాట పెరిగి ఘర్షణనకు దారి తీసింది. రెండు వర్గాలు కత్తులు, ఇనుప రాడ్లతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో మారయ్య సోదరుడు మోటం మల్లేశం (35), లక్ష్మి తరఫున వచ్చిన పెద్దపల్లి మండలం రాఘవపూర్ గ్రామానికి చెందిన పంచాయతీ పెద్దమనిషి గాండ్ల గణేశ్‌ (40) తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలో మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మోటం మధునయ్య, సారయ్యను కరీంనగర్‌‌లోని ఆసుపత్రికి తరలించారు. ఇందులో మధునయ్య పరిస్థితి విషమంగా ఉంది. దాడిలో గాయపడిన మారయ్య, రమేశ్‌కు సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రిలో ఉన్న మృతదేహాలను డీసీపీ కరుణాకర్, ఏసీపీ జి.కృష్ణ, సీఐ సుబ్బారెడ్డి, ఎస్సై శ్రావణ్ కుమార్ పరిశీలించారు.