కెనరా బ్యాంక్‌లో భారీ అగ్నిప్రమాదం.. బ్యాంకులో 50 మంది..!

కెనరా బ్యాంక్‌లో భారీ అగ్నిప్రమాదం.. బ్యాంకులో 50 మంది..!

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని కెనరా బ్యాంకులో సోమవారం (నవంబర్ 20న) సాయంత్రం అగ్నిప్రమాదం జరిగింది. హజ్రత్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నావెల్టీ సినిమా వెనుక ఉన్న కెనరా బ్యాంక్‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. వేగంగా మంటలు భవనం మొత్తం వ్యాపించడంతో కొందరు ఉద్యోగులు భవనంపై నుండి దూకి తమ ప్రాణాలను కాపాడుకున్నారు.

విషయం తెలియగానే ఫైరింజన్లు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. అగ్నిప్రమాక సిబ్బంది మంటలను ఆర్పివేస్తున్నారు. అగ్నిప్రమాదం జరిగిన కెనరా బ్యాంక్ బ్రాంచ్ నావల్ కిషోర్ రోడ్‌లో ఉంది. అయితే బ్యాంకు లోపల నుంచి అరుపుల శబ్దాలు రావడంతో ప్రజలు పెద్ద ఎత్తున గూమికూడారు. దాదాపు 50 మంది బ్యాంకులో చిక్కుకుపోయారన్న సమాచారంతో.. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అందులో ఉన్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు భవనం అద్దాలు పగలగొట్టి అందులో నుంచి రక్షిస్తున్నారు.

బిల్డింగ్ మొదటి అంతస్తులో మంటలు చెలరేగడంతో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ జరిగి ఉండవచ్చని ఒక ఉద్యోగి తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఏడీఎస్పీ మనీషా సింగ్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిప్రమాదానికి కారణం ఇంకా స్పష్టంగా తెలియరాలేదని చెప్పారు. ఈ ఘటనపై అగ్నిమాపక సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.