కలియుగ వైకుంఠం తిరుమల ఏడుకొండల పరిధిలో విమానాలు, హెలికాఫ్టర్లు, డ్రోన్లు ఎగరవేయడంపై నిషేధం ఉన్న సంగతి తెలిసిందే. ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీవారి ఆలయంపై ఎలాంటి వస్తువులు ఎగరవేయకూడదు. అయితే.. శుక్రవారం ( డిసెంబర్ 5 ) తిరుమల శిలాతోరణం దగ్గర డ్రోన్ ఎగరడం కలకలం రేపింది. ఓ వ్యక్తి శిలాతోరణం దగ్గర డ్రోన్ ఎగరేస్తుండగా గుర్తించారు స్థానికులు. అతన్ని పట్టుకొని వెంటనే విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించారు.
స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. డ్రోన్ ఎగరేసిన వ్యక్తి విదేశీయుడిగా ప్రాధమికంగా గుర్తించారు అధికారులు. అతన్ని అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు విజిలెన్స్ అధికారులు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తిరుమల కొండపై విమానాలు, డ్రోన్లు వంటివి ఎగరడం ఇది కొత్త కాదు.. గతంలో కూడా పలుసార్లు తిరుమల కొండపై విమానాలు, డ్రోన్లు ఎగరడం కలకలం రేపింది. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు శ్రీవారి భక్తులు. తిరుమల పవిత్రతను దెబ్బతీసే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా టీటీడీ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు భక్తులు.
