చైనా ఆర్మీ చొరబాట్లు హిమాలయన్ గోల్డ్ కోసమేనా ?

చైనా ఆర్మీ చొరబాట్లు హిమాలయన్ గోల్డ్ కోసమేనా ?

భారత్ కు చెందిన అరుణాచల్ ప్రదేశ్ పై చైనాకు ఎందుకంత గురి ? అక్రమంగా అరుణాచల్ లోకి చొరబడేందుకు డ్రాగన్ ఎందుకు బరితెగిస్తోంది ?  భౌగోళిక, విదేశాంగ పరమైన కారణాల వల్లే చైనా అలా చేస్తోందనే సమాధానమే ఇప్పటివరకు వినిపించింది. తాజాగా ఇండో పసిఫిక్ సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్ (ఐపీసీఎస్సీ) విడుదల చేసిన ఒక నివేదికలో ఆశ్చర్యపరిచే అంశాన్ని ప్రస్తావించారు.  అరుణాచల్ పై చైనా అక్కసుకు ప్రధాన కారణం.. హిమాలయన్ వయాగ్రాగా పిలిచే  ‘హిమాలయన్ గోల్డ్’ అని నివేదిక  పేర్కొంది.

బంగారం కంటే ఎక్కువ రేటు ?

పుట్టగొడుగు రకానికి చెందిన కార్డిసెప్స్ ను గొంగళి పురుగు ఫంగస్ లేదా హిమాలయన్ గోల్డ్  అని పిలుస్తారు. దీనికి చైనాలో బంగారం కంటే ఎక్కువ రేటు ఉందని ఐపీసీఎస్సీ నివేదికలో ప్రస్తావించారు.  దీని ప్రకారం..  హిమాలయన్ గోల్డ్ .. దాని పేరుకు తగ్గట్టుగానే ఇది భారత్ పరిధిలోని హిమాలయాలలో మాత్రమే లభిస్తుంది. మరోవైపు చైనా పరిధిలోని నైరుతి ప్రాంతంలో ఉండే క్వింఘాయ్, టిబెటన్ పీఠభూమిలోని ఎత్తైన ప్రదేశాల్లో కూడా హిమాలయన్ గోల్డ్ దొరుకుతుంది.  10 గ్రాముల హిమాలయన్ గోల్డ్ ధర రూ.56వేల దాకా ఉంటుందని ఒక అంచనా.  ఇందులోనూ మేలి రకం హిమాలయన్ గోల్డ్ కిలో ధర లక్షల్లోనే ఉంటుందని నివేదిక అంచనా వేసింది. ప్రపంచంలోనే అత్యధికంగా హిమాలయన్ గోల్డ్ ను ఉత్పత్తి చేసే, ఎగుమతి చేసే దేశం చైనానే. 

గత రెండేళ్ల వ్యవధిలో ఏమైందంటే.. ?

గత రెండేళ్ల వ్యవధిలో చైనాలోని క్వింఘాయ్ ప్రాంతంలో హిమాలయన్ గోల్డ్ సాగు గణనీయంగా తగ్గిపోయింది. 2017లో చైనాలో 43,500 కేజీల హిమాలయన్ గోల్డ్ ఉత్పత్తి జరగగా.. 2018లో ఇది కాస్తా 41,200 కేజీలకు తగ్గింది. ఇక అంతకుముందు 2011 సంవత్సరంలో చైనా పరిధిలో అత్యధికంగా .1.50 లక్షల కేజీల హిమాలయన్ గోల్డ్ ఉత్పత్తి జరిగింది. ఈ లెక్కన గత 10 ఏళ్లలో చైనాలో దీని సాగు దాదాపు  నాలుగు వంతులు తగ్గిపోయింది. దీంతో హిమాలయన్ గోల్డ్ సాగుకు అనువైన భూమిని దక్కించుకునే క్రమంలోనే అరుణాచల్ ప్రదేశ్ పరిధిలోని హిమాలయన్ ప్రాంతాలపై చైనా కన్నేసిందని నివేదిక తెలిపింది. ఈక్రమంలోనే ఇటీవల కాలంలో అరుణాచల్ సరిహద్దుల్లో  డ్రాగన్ సైన్యం ఆగడాలు మితిమీరాయని పేర్కొంది.  మరో కీలకమైన విషయం ఏమిటంటే.. హిమాలయ ప్రాంతాల్లో నివసించే ప్రజలు సంపాదించే ఆదాయంలో దాదాపు 80 శాతం హిమాలయన్ గోల్డ్ సేకరణ నుంచే వస్తుంటుంది.