విదేశాల్లో స్టడీస్‌‌, జాబ్స్‌‌ కోసం వెళ్లే వారే టార్గెట్‌‌

విదేశాల్లో స్టడీస్‌‌, జాబ్స్‌‌ కోసం వెళ్లే వారే టార్గెట్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు: ఫేక్ సర్టిఫికెట్లు తయారు చేస్తూ, అమ్ముతున్న ముఠా గుట్టు రట్టయింది. తమిళనాడులోని వివిధ వర్సిటీల పేరుతో ఫేక్ సర్టిఫికెట్లను తయారు చేస్తున్న నలుగురిని గురువారం సౌత్‌‌ జోన్‌‌ టాస్క్‌‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్‌‌ చేశారు. నిందితుల నుంచి146 ఫేక్ సర్టిఫికెట్లు, కలర్ ప్రింటర్, కలర్ పిల్లర్స్‌‌, రూ.22 వేల క్యాష్, సెల్‌‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇంటర్, డిగ్రీ ఫేక్ సర్టిఫికెట్లతో విదేశాలకు వెళ్లాలనుకునే వాళ్లకు ఈ సర్టిఫికెట్లను అమ్ముతున్నట్లు గుర్తించారు. ఈ గ్యాంగ్‌‌ వివరాలను టాస్క్‌‌ఫోర్స్‌‌ అడిషనల్‌‌ డీసీపీ గుమ్మి చక్రవర్తితో కలిసి సెంట్రల్‌‌ జోన్ డీసీపీ రాజేశ్‌‌చంద్ర మీడియాకు వెల్లడించారు. హైదరాబాద్ నాంపల్లికి చెందిన మహ్మద్‌‌ ఇతేషామ్‌‌ ఉద్దిన్ హుస్సేన్‌‌(47) స్టడీ అఫైర్స్ ఇంటర్‌‌‌‌నేషనల్‌‌ పేరుతో కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నాడు.

విదేశాల్లో ఉద్యోగాలు, ఉన్నత చదువుల కోసం వెళ్లేవారిని టార్గెట్ చేశాడు. టోలిచౌకికి చెందిన మహ్మద్ అబ్డుల్‌‌ ఖదీర్‌‌‌‌(42), మలక్‌‌పేట్‌‌లోని కెరీర్‌‌‌‌ వింగ్‌‌ స్టడీ కన్సల్టెన్సీకి చెదిన మహ్మద్‌‌ అల్తాఫ్‌‌ అహ్మద్‌‌(43), అంబర్‌‌‌‌పేట్‌‌కు చెందిన ఆన్‌‌లైన్ సర్వీసెస్‌‌ నిర్వాహకుడు మహ్మద్‌‌ ఇమ్రాన్‌‌(41)తో కలిసి గ్యాంగ్ ఏర్పాటు చేశాడు. తమిళనాడుకు చెందిన అన్నా యూనివర్సిటీ, ఎస్‌‌ఈసీ, తిరువల్లువర్‌‌‌‌, సత్యభామ యూనివర్సిటీలతో పాటు మీరట్‌‌, పుణే, సిక్కిం సహా మొత్తం13 యూనివర్సిటీల పేర్లతో సర్టిఫికెట్లు ప్రింట్ చేస్తూ.. ఒక్కో సర్టిఫికెట్‌‌కు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారు. ఇలా ఇప్పటికే 30 మందికి ఫేక్ సర్టిఫికెట్లు సేల్ చేశారు.