సీబీఐ ఆఫీసర్లమంటూ రైడ్స్​.. 30 లక్షలు, ఆభరణాలు ఎత్తుకెళ్లిన గ్యాంగ్

సీబీఐ ఆఫీసర్లమంటూ రైడ్స్​.. 30 లక్షలు,  ఆభరణాలు ఎత్తుకెళ్లిన గ్యాంగ్

కోల్‭కతాలోని భవానీపూర్‭లో సీబీఐ అధికారుల పేరుతో కొందరు హల్ చల్ చేశారు. ఓ వ్యాపారవేత్త ఇంటి పై సోదాలు చేసి.. రూ.30 లక్షల నగదు, ఆభరణాలు ఎత్తుకెళ్లారు. దాదాపు ఎనిమిది మంది గుర్తు తెలియని వ్యక్తులు కలిసి ఈ దోపిడీకి పాల్పడ్డారు. దీనిపై బాధితుడు సురేష్ వాధ్వా భవానీపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఉదయం ఎనిమిది గంటల సమయంలో ఎనిమిది మంది వ్యక్తులు తమ ఇంటికి వచ్చి సీబీఐ అధికారులమని చెప్పి.. తనిఖీలు చేశారని పోలీసులకు తెలిపాడు. వాళ్లు వచ్చిన వాహనాలపై పోలీస్ స్టిక్కర్లు ఉన్నాయని చెప్పాడు. ఐడీ కార్డు చూపించమని అడిగినా చూపించకుండా దౌర్జన్యం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. 

ఇళ్లంతా తనిఖీలు చేసి..  రూ.30లక్షల నగదు, కొన్ని లక్షల విలువైన బంగారాన్ని సీజ్ చేసినట్లు చెప్పారని సురేష్ వాధ్వా తెలిపాడు. సీజ్ చేసిన వాటి లిస్ట్ తో పాటు.. విచారణకు హాజరు కావాలని చెప్పారని అన్నాడు. కొద్ది రోజుల తర్వాత నోటీసులు పంపిస్తామని చెప్పి వెళ్లిపోయారని తెలిపాడు. చివరికి తాను మోసపోయానని తెలుసుకుని పోలీస్ స్టేషన్ కి వచ్చినట్లు బాధితుడు చెప్పాడు. అయితే ఈ దోపిడీలో సురేశ్ సన్నిహితులు లేదా అతనికి బాగా తెలిసిన వాళ్ల ప్రమేయం ఉండి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీటీవీలను పరిశీలించి వివరాలు తెలుసుకుని.. నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.