వర్సిటీలపై ప్రభుత్వ గుత్తాధిపత్యమా? : డా. మామిడాల ఇస్తారి

వర్సిటీలపై ప్రభుత్వ గుత్తాధిపత్యమా? : డా. మామిడాల ఇస్తారి

తెలంగాణా రాష్ట్రంలో ఉన్న 15 వర్సిటీల్లో  ఖాళీగా ఉన్న 2020 అసిస్టెంట్, అసోసియేట్​,  ప్రొఫెసర్ల పోస్టుల భర్తీ కొరకు కామన్ రిక్రూట్ మెంట్ బోర్డును రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ జూన్  నెలలో ఏర్పాటుచేసింది.  గత నెలలో ఈ బిల్లుపై  అసెంబ్లీ తీర్మానం చేసి గవర్నర్ ఆమోదం కోసం పంపగా, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈ నియామక బిల్లులోని వాస్తవాలను తెలుసుకునేందుకు, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుంచి కూడా ఈ కామన్ రిక్రూట్మెంట్ బోర్డుపై ఒక స్పష్టమైన నివేదిక అవసరమని సూచించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇరుకున పడినట్లైందని మేధావి వర్గాలు అంటున్నాయి. గవర్నర్ జోక్యంతో వర్సిటీలపై ప్రభుత్వ గుత్తాధిపత్యానికి కత్తెర పెట్టినట్టయింది.

వర్సిటీల స్వయం ప్రతిపత్తిపై ప్రభుత్వ జులుం 

ఒకవైపు వర్సిటీ టీచర్ల నియామకంలో పూర్తిపెత్తనం రాష్ట్ర ప్రభుత్వం వహించే విధంగా కామన్ బోర్డు ఏర్పాటు చేయడం జరుగుతుంటే, మరొకవైపు వర్సిటీలకు కులపతిగా ఉన్న గవర్నర్ ని తీసివేసి ముఖ్యమంత్రి కులపతిగా ఉండేటట్లు ఒక కొత్త చట్టం తీసుకురావాలనే కుట్ర జరుగుతున్నట్టు గతంలో వార్తా పత్రికలు వెల్లడించాయి. విద్యావ్యవస్థను పూర్తిగా రాజకీయం చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ఇప్పటికే ఒక రాజకీయ నాయకుని సన్నిహితునికి పూర్తి అర్హత లేకున్నా ఉపకులపతి పదవి కట్టబెట్టారని కేసులు దాఖలయ్యాయి. ఆ కేసులకు సంబంధించిన జడ్జిమెంట్ సకాలంలో బయటకు రాకుండా రాజకీయ ఒత్తిడి చేసే అవకాశాలు లేకపోలేదు. రాజకీయ జోక్యం ఇంతలా ఉంటే భవిష్యత్తులో వర్సిటీల పాలన పూర్తిగా ప్రభుత్వం చేతుల్లోకి వెళుతుంది. వర్సిటీల స్వయం ప్రతిపత్తిపై ప్రభుత్వ జులుంను ప్రశ్నించాల్సిన వర్సిటీ అధికారులు మూగబోయి తమ అధికారాన్ని యధేచ్చగా అనుభవిస్తున్నారు.  వర్సిటీలన్ని సమస్యలకు నిలయాలుగా మారుస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు.

కామన్ బోర్డు పేరుతో ప్రభుత్వం కాలయాపన...

ప్రభుత్వ వర్సిటీలను బలోపేతం చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని గత 10 ఏండ్లుగా విద్యార్థులు, ఆచార్యులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని వాటిని పట్టించుకునే అధికారులు మాత్రం కరువయ్యారని వర్సిటీల విద్యార్థి సంఘాలు, టీచర్ల సంఘాలు అనేక సార్లు ఉద్యమాలు చేశాయి. చివరకు వర్సిటీ ల సమస్యలను పట్టించుకోవాలని గవర్నర్ దగ్గరికి వెళ్లి వివరించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం వర్సిటీల్లో కామన్ బోర్డు పేరిట కేవలం కాలయాపన చేస్తున్నట్టు ప్రస్తుత పరిస్థితిని  చూస్తే అర్థమవుతుంది. వర్సిటీ టీచర్ల నియామకం కోసం కామన్ బోర్డును ఏర్పాటు చేయడం యూజీసీ 2018 నిబంధనలకు విరుద్ధం.  గతంలో దేశంలోని ఒకటి, రెండు రాష్ట్రాల్లో ఇటువంటి ప్రతిపాదన రాగా చివరకు యూజీసీ, హైకోర్టు, సుప్రీంకోర్టు జోక్యంతో నియామకాలు నిలిపివేసిందనే విషయం ప్రభుత్వానికి తెలియదా ? తెలిసి కూడా ఇంకా కామన్ బోర్డు పై మాట్లాడుతుందంటే ఇది కేవలం కాలయాపన కొరకు మాత్రమే అని అర్థం అవుతుంది. బోర్డు నియామకం కూడా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సిఫార్సులకు వ్యతిరేకంగా చేపట్టారు. 

వర్సిటీలను సంరక్షించే భాద్యత గవర్నర్ దే 

రాజకీయ జోక్యంతో ఉన్నత విద్య పూర్తిగా ఒకవైపు అస్తవ్యస్థం అవుతూ ఉంటే దానిపై దృష్టి సారించాల్సిన వర్సిటీల పాలక మండలి సభ్యులు, ఐ,ఏ.ఎస్. అధికారులు, విద్యా శాఖ అధికారులు కూడా పూర్తిగా ప్రభుత్వ నిర్ణయాలకే మద్దతు పలుకుతున్నారనే విమర్శలు ఉన్నాయి. వర్సిటీల్లో  అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించడంలో విఫలమైన కాకతీయ వర్సిటీ వీసీ, రిజిస్ట్రార్, ఇతర అధికారులు కనీసం విద్యార్థుల సమస్యల గురించి విద్యార్థులతో కూడా మాట్లాడడం లేదు. విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తే వారిపై కేసులు పెట్టి బెదిరించి సమస్యలని జటిలం చేస్తున్నారు. రాజకీయుల  చేతిలో వర్సిటీల వ్యవస్థలు కీలుబొమ్మలుగా మారిపోతుండడం దురదృష్టకరం.  ఒకవైపు వర్సిటీల్లో ఆధిపత్యం చలాయించడానికి యూజీసీ నిబంధనలను పక్కన పెట్టి,  ప్రభుత్వం చేసే పన్నాగం, మరొక వైపు వర్సిటీల్లో విద్యార్థుల, టీచర్ల సమస్యలను గడ్డి పోచతో సమానంగా చూసే వర్సిటీ అధికారుల తీరు మారాలంటే.. వర్సిటీ కులపతి హోదాలో రాష్ట్ర గవర్నర్ జోక్యం చేసుకోవాల్సిన అవసరం వుందని మేధావి వర్గాలు అంటున్నాయి. ఈ దరిమిలా గవర్నర్ తమిళిసై ప్రభుత్వం ప్రతిపాదించిన కామన్ బోర్డు నిర్ణయం పట్ల యూజీసీ కి లేఖ రాయడం, విద్యాశాఖ అధికారులతో చర్చించాలనే నిర్ణయం తీసుకోవడం సరైనదే.  వర్సిటీలను సంరక్షించే పూర్తి బాధ్యత గవర్నర్ తీసుకోవాలని విశ్వవిద్యాలయాల సీనియర్ ప్రొఫెసర్లు అంటున్నారు. గవర్నర్ విధానాన్ని ప్రభుత్వం తప్పుపట్టడం సిగ్గుచేటని, టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల నియామకం, ఇతర విషయాల పట్ల గత మూడు ఏండ్లుగా ప్రభుత్వానికి గవర్నర్ ఎన్ని లేఖలు రాసినా,  ప్రభుత్వం నుండి సమాధానం లేదని, గవర్నర్ పట్ల తప్పుడు ప్రచారం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారని గవర్నర్ పత్రికా సమావేశంపెట్టి చెప్పడంతో వర్సిటీల పట్ల ప్రభుత్వ కుట్ర తేటతెల్లమైందని చెప్పొచ్చు.   

మౌనం వహిస్తున్న వర్సిటీల ఉపకులపతులు

దాదాపు ఒక దశాబ్ద కాలం నుండి టీచింగ్ పోస్టులు భర్తీకి నోచుకోక వర్సిటీల్లోని విభాగాలు కొన్ని ఖాళీ అయి కోర్సులు నడపలేని పరిస్థితి ఎదురైంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వర్సిటీల్లో ఖాళీలు భర్తీ చేసేందుకు కామన్ రిక్రూట్మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని కొన్ని వర్సిటీల ఉపకులపతులు వ్యతిరేకించినా బోర్డు నియామకం మాత్రం ఆగలేదు. రాష్ట్రంలోని వర్సిటీలన్నింటిపై పూర్తి ఆధిపత్యం చలాయించడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయా వర్సిటీల ఉపకులపతులు గట్టిగా వ్యతిరేకించలేకపోయారు. ఎందుకంటే వర్సిటీల వీసీలందరూ ప్రభుత్వ దయాదాక్షిణ్యాలతోనే నియామకం అయ్యారు కాబట్టి.  వర్సిటీల వీసీలు పూర్తిగా  ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అన్ని శాఖల్లో పదవీ విరమణ వయస్సు పెంచినప్పటికీ కేవలం వర్సిటీల్లో పదవీ విరమణ వయస్సు పెంచక వర్సిటీలను పూర్తిగా ఎడారిమయం చేస్తున్నా కూడా వర్సిటీల వీసీ లు మాత్రం నోరు మెదపకుండా తమ అధికారాన్ని అనుభవిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

- డా. మామిడాల ఇస్తారి, జనరల్ సెక్రటరి, కే.యూ. టీచర్స్ అసోసియేషన్