అవినీతి అధికారులపై ఏసీబీ కొరడా .. ఆరు నెలల్లో 125 మంది అరెస్ట్

అవినీతి అధికారులపై ఏసీబీ కొరడా .. ఆరు నెలల్లో 125 మంది అరెస్ట్
  • రూ.24.57 లక్షలు సీజ్‌‌‌‌, రూ.27.66 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్‌‌‌‌
  • గత నెలలో రోజుకు ఒకటి చొప్పున 31 కేసులు నమోదు
  • లంచం అడిగితే టోల్‌‌‌‌ ఫ్రీ నంబర్‌‌‌‌‌‌‌‌ 1064, వాట్సాప్‌‌‌‌ 9440446106 కాల్‌‌‌‌ చేయాలని సూచన

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: అవినీతి అధికారులపై రాష్ట్ర ఏసీబీ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించిన ఆస్తులను అటాచ్‌‌‌‌ చేస్తున్నారు. ఆకస్మిక తనిఖీలతో అవినీతి అధికారులను కట్టడి చేస్తున్నారు. గత నెలలో రోజుకు సగటున ఒకటి చొప్పున మొత్తం31 అవినీతి కేసులు నమోదుకాగా, ఈ ఏడాది ఆరు నెలల్లోనే నెలకు సగటున 21 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఏసీబీ డీజీ విజయ్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ఏడాది జనవరి నుంచి జూన్‌‌‌‌ 30 వరకు అవినీతి కేసుల్లో 80 మందిని రెడ్‌‌‌‌ హ్యాండెడ్‌‌‌‌గా పట్టుకున్నారు. 

వీటితో పాటు 8 ఆదాయానికి మించి ఆస్తుల కేసులు, 14 అధికార దుర్వినియోగం, పది సాధారణ విచారణలు, 11 ఆకస్మిక తనిఖీ కేసులు, మూడు డిస్క్రీట్‌‌‌‌ ఎంక్వైరీస్‌‌‌‌ కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ ఆఫీసుల్లో పనిచేస్తున్న ఔట్‌‌‌‌ సోర్సింగ్ ఉద్యోగులు సహా మొత్తం 8 మంది ‍ప్రైవేటు వ్యక్తులు, ప్రభుత్వ అధికారులు కలిపి 125 మందిని అరెస్టు చేసి, రూ.24.57 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో రూ.27.66 కోట్లు విలువ చేసే ఆస్తులను సీజ్‌‌‌‌ చేశారు.

ఆర్టీఏ ఆఫీసులపై ప్రభుత్వానికి నివేదిక..

ఆరు నెలల్లో మొత్తం 126 కేసులకు సంబంధించి తుది నివేదికను ప్రభుత్వానికి పంపించారు. జూన్‌‌‌‌ 1 నుంచి 30 వరకు 15 ట్రాప్‌‌‌‌ కేసులు, ఆర్టీఏ ఆఫీసులు, చెక్ పోస్టుల్లో ఆకస్మిక తనిఖీలు సహా మొత్తం 31 కేసులు నమోదు చేశారు. ఆర్టీఏ చెక్‌‌‌‌ పోస్టుల్లో రూ.2.72 లక్షలు సీజ్‌‌‌‌ చేశారు. ఆర్టీఏ ఆఫీసులపై సోదాలకు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి పంపించారు. ఈ క్రమంలో జూన్‌‌‌‌లో మొత్తం 11 కేసుల్లో తుది నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపినట్టు డీజీ విజయ్‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ వెల్లడించారు.

 ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే టోల్ ఫ్రీ నంబర్‌‌‌‌‌‌‌‌ 1064తో పాటు 94404 46106 వాట్సాప్, ఏసీబీ ఫేస్‌‌‌‌బుక్‌‌‌‌, ‘ఎక్స్’వంటి సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ఫిర్యాదు చేయొచ్చని సూచించారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ప్రభుత్వ అధికారులు, మధ్యవర్తులకు సంబంధించిన ఎలాంటి సమాచారం తెలిసినా ఏసీబీ టోల్‌‌‌‌ ఫ్రీ నంబర్‌‌‌‌‌‌‌‌కు కాల్‌‌‌‌ లేదా మెయిల్‌‌‌‌ ద్వారా తెలియచేయాలని సూచించారు.