జీపీ నిధులు ఖర్చు చేయడం లేదంటూ ఓ టీచర్ వినూత్న నిరసన

జీపీ నిధులు ఖర్చు చేయడం లేదంటూ ఓ టీచర్ వినూత్న నిరసన

కరీంనగర్: గ్రామ పంచాయతీలో నిధులున్నా ఎలాంటి అభివృద్ధి చేయడం లేదంటూ ఓ ప్రభుత్వ టీచర్ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశాడు. కరెన్సీ కట్టలు, పూలు, పండ్లతో కూడిన పళ్లెంను పంచాయతీ లోపల పెట్టి ఆందోళన చేశాడు. ఇల్లందకుంట మండలం టేకుర్తి గ్రామానికి చెందిన రామ్ రాజయ్య అనే వ్యక్తి వృత్తి రీత్యా ప్రభుత్వ ఉపాధ్యాయుడు. స్థానిక గ్రామ పంచాయతీలో దాదాపు రూ.18 లక్షలు నిధులున్నాయి. సర్పంచ్, సెక్రటరీ ఆ నిధులను అభివృద్ధి పనులకు వినియోగించడంలేదని గమనించిన టీచర్ రామ్ రాజయ్య... ఆ నిధులను ఉపయోగించి గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు.

కానీ నెలలు గడుస్తున్నా.. పట్టించుకోక పోవడంతో టీచర్ వినూత్నంగా తన నిరసనను వ్యక్తం చేశాడు. కరెన్సీ కట్టలు, పూలు, పండ్లతో కూడిన పళ్లెంను జీపీ కార్యాలయంలోని కుర్చీపై పెట్టి ఆందోళనకు దిగాడు. ఓ వైపు నిధులు లేక రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల సర్పంచులు ఇబ్బంది పడుతోంటే... ఇక్కడ మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉందని, గ్రామ అభివృద్ది కోసం ఖర్చు చేయకుండా రూ.18లక్షల నిధులు నిల్వ ఉంచిన సర్పంచ్, కార్యదర్శిలపై చర్యలు తీసుకోవాలని ఆ ప్రభుత్వ ఉపాధ్యాయుడు డిమాండ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.