ఆటో డ్రైవర్ మానవత్వం.. గర్భిణిని కాపాడాడు.. తల్లిలేని బిడ్డకు తండ్రయ్యాడు

ఆటో డ్రైవర్ మానవత్వం.. గర్భిణిని కాపాడాడు.. తల్లిలేని బిడ్డకు తండ్రయ్యాడు

కర్ణాటక బెంగళూరులో ఓ ఆటో డ్రైవర్ తన మానవత్వాన్ని.. మంచి మనసును చాటుకున్నాడు. ఆయన పేరు బాబు ముద్రప్ప.  ఏప్రిల్ 15న వైట్ ఫీల్డ్ ఏరియాలో రాత్రివేళ ఓ గర్భిణి స్త్రీ రోడ్డు పక్కన పురిటి నొప్పులతో ఇబ్బంది పడుతుండగా చూసి చలించిపోయాడు. ఎవరూ ఆమెకు సాయం చేయకపోతుండటంతో.. ఆయనే ఆమెను తన ఆటోలో ఎక్కించుకుని స్థానిక వైదేహి హాస్పిటల్ కు తీసుకెళ్లాడు. తర్వాత డాక్టర్ల సూచనతో.. సీవీ రామన్ హాస్పిటల్ కు తీసుకెళ్లి అక్కడ అడ్మిట్ చేయించాడు. ఆమె పేరు నందిత అని .. ఆమె సంబంధీకులు ఎవరో తెలియదని ముద్రప్ప చెప్పడంతో.. హాస్పిటల్ సిబ్బంది… కేర్ టేకర్ డీటెయిల్స్ కావాలన్నారు. వెంటనే తన పేరు, నంబర్ ఇచ్చి ట్రీట్ మెంట్ కొనసాగించాలని కోరాడు.

ఆమె అడ్మిట్ అయిన తర్వాత.. తన ఇంటికి వెళ్లి మళ్లీ ఉదయాన్నే హాస్పిటల్ కు వెళ్లాడు ముద్రప్ప. రాత్రి వేళ ఆ మహిళ ఆడపిల్లకు జన్మనిచ్చిందనీ.. తెల్లవారేసరికి బెడ్ పై ఆమె లేదని.. హాస్పిటల్ నుంచి పారిపోయిందని సిబ్బంది ముద్రప్పకు చెప్పారు.

ఆ పరిస్థితుల్లో ఆ చిన్నారి పాపను దిక్కులేకుండా వదిలేయడం ముద్రప్పకు నచ్చలేదు. తానే పాపను దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. పాప పూర్తిగా నెలలు నిండకముందే పుట్టిందని… కొద్దిరోజులు చికిత్స కొనసాగించాల్సి ఉందని డాక్టర్లు చెప్పడంతో.. సరేనని ఒప్పుకున్నాడు. పాపకు ట్రీట్ మెంట్ కు అవసరమైన ఖర్చులు ఆయనే భరించాడు. రోజంతా ఆటో నడపడం… రాత్రివేళ హాస్పిటల్ లో పాపను చూసుకోవడం… 18 రోజుల పాటు ఇదే ముద్రప్ప దినచర్య అయిపోయింది.

ఐతే… మే 3వ తేదీన హాస్పిటల్ నుంచి వచ్చిన ఓ ఫోన్ కాల్ తో ముద్రప్ప షాక్ అయ్యాడు. శ్వాస సంబంధిత సమస్యలతో ఆ చిన్నారి చనిపోయిందని చెప్పడంతో… చాలా బాధపడ్డాడు. వెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశాడు. ఆ బిడ్డకు తల్లిని వెతికాలని… ఆమె జన్మనిచ్చిన పాప చనిపోయినట్టుగా ఆమెకు సమాచారం ఇవ్వాలని కోరాడు. పోలీసుల సహాయంతో.. తన చేతులతో ఆ పాప అంత్యక్రియలు పూర్తిచేశాడు.

ఈ విషయం పోలీసుల ద్వారా.. మీడియాకు తెలిసింది. మంచి మనసున్న ఆటో డ్రైవర్ ముద్రప్ప కథనాలు సోషల్ మీడియాలో ప్రసారం అయ్యాయి. తనకు ఆ బిడ్డ ఎవరో తెలియకపోయినా.. సొంత బిడ్డే అనుకున్నాననీ… 18 రోజుల్లో చాలా దగ్గరైందని చెప్పారు ముద్రప్ప. తనకు అప్పటికే ఇద్దరు పాపలు ఉన్నారనీ.. ఈ పాపను పెంచుకుందామని చెప్పినా భార్య వద్దనలేదని గుర్తుచేశారు. ఏ తల్లి అయినా తన బిడ్డను అలా వదిలేసి పారిపోవద్దని ఆయన కోరారు. ఓ గర్భిణిని కాపాడటం.. ఆమె బిడ్డను బతికించాలన్న తపన పడటంతో… ఆ డ్రైవర్ చాలా గొప్ప మనసున్న వాడంటూ జనం మెచ్చుకుంటున్నారు.