పాలిస్టర్ వస్త్రాలతో పర్యావరణ కాలుష్యం.. శరీరంపై దుష్ప్రభావం

పాలిస్టర్ వస్త్రాలతో పర్యావరణ కాలుష్యం.. శరీరంపై దుష్ప్రభావం

వాతావరణంలో తీవ్ర మార్పులకు భూతాపం పెరగడం ఒక కారణం. భూతాపం పెరగడానికి శిలాజ ఇంధనాల వాడకం లాంటి కారణాలున్నాయి. ఆ వాడకంలో నుంచి వచ్చింది పాలిస్టర్ వస్త్రాలు. కాలుష్యం కలుగజేసే ఈ వస్త్రాలు, శరీరం మీద కూడా దుష్ప్రభావం చూపెడతాయి. ఉత్పత్తి క్రమంలో కూడా పర్యావరణం మీద వీటి దుష్ప్రభావం ఉంటుంది. ఆధునిక జీవన శైలి ఇలాంటి వస్త్రాలను ప్రోత్సహిస్తున్నది. 
ఏడాదికి రెండు జతల బట్టలు దొరకని కుటుంబాలు కోట్లల్లో ఉంటే, గంటకో డ్రెస్​మార్చే వ్యక్తులు వేలల్లో ఉన్నారు. వారి స్థాయిని అందుకోవడం అనేక మందికి ఒక జీవనలక్ష్యంగా మారింది. ఇలాంటి ఆధునిక ఆర్థిక వ్యవస్థలలో నుంచి వస్త్ర రంగం ద్వారా భూమి మీద మిగులుతున్నది ఏమిటయ్యా అంటే.. గాలి కాలుష్యం, నీటి కాలుష్యం, కుప్పలు కుప్పలుగా వాడి పడేసిన వస్త్రాలు, పేదరికంలో మగ్గుతున్న వస్త్ర కంపెనీ కార్మికులు. 

ఫ్యాషన్​ పరిశ్రమ విస్తరణతో..
ఫ్యాషన్ ఇండస్ట్రీ విస్తరించడానికి ప్రపంచీకరణ దోహదపడింది. ప్రపంచ వాణిజ్య సంస్థ ఆధ్వర్యంలో జరిగిన వస్త్ర వాణిజ్య ఒప్పందాల వల్ల వస్త్ర ఉత్పత్తి ఒక దేశంలో, వస్త్రధారణ మరో దేశంలో సాధ్యపడింది. ఇదే అభివృద్ధి అని మనకు నూరి పోసిన ప్రభుత్వాధినేతలు, వాణిజ్య నిపుణులు, ఆర్థికవేత్తలు, ఇప్పటికీ దేశీయ వస్త్ర పరిశ్రమ మనుగడ ఎగుమతుల ద్వారానే సాధ్యం అని చెబుతున్నారు. ఉత్పత్తి నుంచి వినియోగం వరకు ఉన్న గొలుసుకట్టు వాణిజ్యం మీద పట్టు ఉన్నది కొన్ని బహుళ జాతి కంపెనీలకే. దేశీయ వస్త్ర పరిశ్రమ విధానాలు వీరి కనుసన్నల్లో రూపుదిద్దుకుంటాయి. 
వీరు బంగ్లా దేశ్ విదేవీ మారక ఆర్జనను ఉదహరిస్తారు. అక్కడి వస్త్ర పరిశ్రమల్లో జరిగిన అగ్ని ప్రమాదాల్లో మరణించిన వందలాది వ్యక్తుల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. విదేశీ మారకం ఎట్లా ఉన్న, సగటు జీవన ప్రమాణాలు అక్కడ పెరగలేదు. శ్రీలంకలో కూడా దృఢంగా ఉన్నా గార్మెంట్ ఇండస్ట్రీ కుప్పకూలింది. ఉత్పత్తి దగ్గర అనేక సమస్యలు మిగులుస్తున్న ఈ ఫ్యాషన్ పరిశ్రమ, టన్నుల కొద్దీ ‘ఉపయోగపడని’ వస్త్రాలను ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేసి తమ వీధుల్లో ‘చెత్త’ లేకుండా చూసుకుంటున్నా ధనిక దేశాల గురించి ప్రస్తావన చేయని ఆర్థికవేత్తలు ఉన్నారు.

పర్యావరణానికి నష్టం
1975 నుంచి 2018 వరకు ప్రపంచవ్యాప్తంగా తలసరి వస్త్ర ఉత్పత్తి ఏడాదికి5.9 కిలోల నుంచి13 కిలోలకు పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా దుస్తుల వినియోగం ఏడాదికి సుమారు 62 మిలియన్ టన్నులకు పెరిగింది. 2030 సంవత్సరం నాటికి102 మిలియన్ టన్నులకు చేరుకుంటుందని అంచనా. ఫాస్ట్ ఫ్యాషన్ బ్రాండ్లు 2000 సంవత్సరం కంటే నేడు రెట్టింపు మొత్తంలో బట్టలను ఉత్పత్తి చేస్తున్నాయి. అధిక వస్త్ర ఉత్పత్తి, ఉత్పత్తికి ముందు, వినియోగం తరువాత, వస్త్ర వ్యర్థాలు రెండింటిలోనూ పెరుగుదలకు కారణమైంది. 
దుస్తులు కుట్టేటప్పుడు పెద్ద సంఖ్యలో వస్త్రాలు వృథా అవుతాయి. వాటిని ఏ విధంగాను ఉపయోగించలేం. ఒక అధ్యయనం ప్రకారం దుస్తుల తయారీలో ఉపయోగించే వస్త్రం15 శాతం వృథా అవుతుందని అంచనా వేసింది. 2012లో ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయిన సుమారు150 మిలియన్ల దుస్తులలో 60 శాతం బట్టలు ఉత్పత్తి అయిన కొన్ని ఏండ్ల తరువాత తొలగించబడ్డాయి. అవన్నీ కూడా చెత్త కుప్పల్లో దర్శనిమిస్తున్నాయి. ఈ సింథటిక్ వస్త్రాలు సహజ నూలుతో చేసినవి కావు కాబట్టి మట్టిలో కలవడానికి అనేక ఏండ్లు పట్టొచ్చు.

ఇండియా దగ్గర పరిష్కారం
మహాసముద్రాల్లో ఇటీవల కనపడుతున్న సూక్ష్మ ప్లాస్టిక్ వ్యర్ధాలకు ప్రధాన కారణం ఫ్యాషన్ ప్రపంచం ఉపయోగించే సింథటిక్ మెటీరియల్స్. మొత్తం మైక్రోప్లాస్టిక్స్ లో సాధారణంగా వాషింగ్ మెషిన్లలో ఉపయోగించే నీటి ద్వారా వచ్చే సింథటిక్ వస్త్ర అవశేషాల వాటా 35 శాతం. ఫ్యాషన్ పరిశ్రమ కూడా పెద్ద మొత్తంలో నీటిని ఉపయోగిస్తుంది. పరిశ్రమలు ఉపయోగించే మొత్తం నీటిలో పదో వంతు వస్త్ర పరిశ్రమదే. 2015లో ఫ్యాషన్ పరిశ్రమ నీటి వినియోగం మొత్తం 79 బిలియన్ క్యూబిక్ మీటర్లు. ఈ నీరు చెరువులను, కుంటలను, నదులను కలుషితం చేస్తున్నది. ఆధునిక వస్త్ర పరిశ్రమ వల్ల పర్యావరణం మీద పుడమి వాతావరణం మీద తీవ్ర దుష్ప్రభావం అనేక రకాలుగా, అనేక ప్రాంతాల్లో కలుగుతోంది. 
నిరుడు బ్రిటన్ లో జరిగిన COP26 సమావేశంలో ఫ్యాషన్ పరిశ్రమకు సంబంధించిన వివిధ వర్గాల వారు పర్యావరణం మీద దుష్ప్రభావం తగ్గించే చర్యల మీద ఒక ఒప్పందానికి వచ్చారు. అంతర్జాతీయంగా, ఫ్యాషన్ ప్రపంచం ఎదురుకుంటున్న సవాళ్లకు పరిష్కారం మన దగ్గర ఉంది. భారత దేశంలో గణనీయంగా ఉన్న చేనేత రంగానికి అనేక రకాల వస్త్ర ఉత్పత్తులను పర్యావరణ సూత్రాలకు అనుగుణంగా అందించే స్తోమత ఉన్నా, ప్రభుత్వ ప్రోత్సాహం లేదు. అనైతిక పోటీ వల్ల, విధాన వివక్ష వల్ల చేనేత నష్టపోతున్నది. నిధుల లేమి, కొరవడిన సానుభూతి, వివక్ష, నాయకులలో అవగాహన లోపం, సమన్వయ లేమి, చిన్న ఉత్పత్తిదారుల పట్ల లోపించిన చిత్తశుద్ధి, చట్టాల్లో లొసుగులు వంటి కారణాలు చేనేతను వెంటాడుతున్నాయి.

అభివృద్ధికి ఇవీ మార్గాలు

పర్యావరణాన్ని కాపాడుతూ, గ్రామీణ స్థాయిలో ఉపాధి కల్పిస్తూ, ఆర్థిక రంగం మీద భారం పడకుండా మనగలిగే సామర్థ్యం కేవలం చేనేత రంగానికే ఉంది. చేనేత రంగం వృద్ధి చెందడం వల్ల, ప్రభుత్వం చాల తక్కువ పెట్టుబడితో, ఎక్కువ వృద్ధి రేటు సాధించవచ్చు. చేనేత రంగ అభివృద్ధికి సానుకూల రాజకీయ దృష్టి కావాలి. చేనేత మార్కెట్లు ఉత్పత్తులు అనేక రకాలు, అనేక ప్రాంతాల్లో విస్తరించి ఉంది. ఆధునిక మరమగ్గాల, మిల్లులు సబ్సిడీలు లేకుండా తమంత తాము నిలదొక్కుకునే పరిస్థితి లేదు. గత 10 ఏండ్లలో జౌళి రంగంలో పెట్టుబడులు పెట్టిన రాజకీయ నాయకుల అండతో, ప్రభుత్వ మద్దతు సాధించి దాదాపు రూ.3 లక్షల కోట్ల సబ్సిడీలు తీసుకున్నా కూడా జౌళి రంగ వృద్ధి శాతం14 శాతం నుంచి 5 శాతానికి పడిపోయింది.
అదే కాలంలో, చేనేత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందలేదు. పర్యావరణ అనుకూల వస్త్ర ఉత్పత్తికి అనుగుణమైన విధాన నిర్ణయాలు ప్రకటించే రాజకీయ నాయకత్వం అవసరం. కేంద్ర ప్రభుత్వం జాతీయ ఫైబర్ విధానంలో కృత్రిమ నూలుకు పెద్ద పీట వేస్తున్నది. కృత్రిమ నూలు రంగానికి, జౌళి పరిశ్రమ అభివృద్ధి పేరుతో, ప్రభుత్వం ప్రోత్సాహం ఇవ్వడం వల్ల పర్యావరణానికి విఘాతం, వ్యక్తిగత ఆరోగ్యానికి ప్రమాదం, దేశ ఆర్థిక ప్రగతికి గొడ్డలిపెట్టు. జాతీయ ఫైబర్ విధానాన్ని సవరించాలి. సహజ నూలుకు, చేనేతకు అనుకూలంగా తయారు చేస్తే చేనేత రంగానికి, కోట్లాది చేనేత కుటుంబాలకు మేలు చేసిన వారవుతారు. 

నిధుల కేటాయింపులేవి?

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేతకు ఇచ్చే బడ్జెట్ చాలా తక్కువ. గత 8 ఏండ్లలో చేనేతకు కేటాయింపులు తగ్గిస్తూ వస్తున్నాయి. కేటాయించిన నిధుల్లో కూడా జౌళి రంగానికి, పవర్​లూమ్ రంగానికి, జీతాలకు పోను, నికరంగా చేనేత రంగానికి మిగిలేది చాలా తక్కువ. పథకాల సంఖ్య తగ్గించేశారు. పథకాల అమలులో అవినీతి ఉంది. రాష్ట్రాలకు వచ్చే నిధులు చాలా తక్కువ. రాజకీయంగా పోరాడటం, ఒక ఎత్తు అయితే, అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం కూడా చేనేత కుటుంబాలకు సమస్యగా మారింది. 
2017 నుంచి కొత్తగా వేస్తున్న జీఎస్టీ కూడా చేనేత మీద భారం పెంచింది. తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ చీరల పథకం చేనేత రంగం కోసం తెచ్చింది కాదు. తెలంగాణ కేటాయింపుల్లో చేనేతకు ప్రత్యేక నిధులు దాదాపు సున్నా. శాఖ పేరులో చేనేత ఉన్నా, ఒక్క రూపాయి కూడా అక్కరకు రావడం లేదు. ముడి సరుకు ధరలు పెరగడం చేనేత ఉత్పత్తికి ప్రధాన విఘాతంగా మారింది. దీంతో చేనేత కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు చేనేతకు కేటాయింపులు తగ్గుతుంటే, ఆధునిక యంత్రాల ఆధారంగా జరిగే జౌళి రంగానికి ప్రభుత్వ పెట్టుబడులు పెరుగుతూనే ఉన్నాయి. 

- దొంతి నరసింహారెడ్డి, పాలసీ ఎనలిస్ట్