కంటికి కన్ను కాదు.. తల తీసేస్తాం: ఇరాన్ ఆర్మీ కొత్త సలహాదారు మొహ్సేన్ రెజాయ్ హెచ్చరిక

కంటికి కన్ను కాదు.. తల తీసేస్తాం: ఇరాన్ ఆర్మీ కొత్త సలహాదారు మొహ్సేన్ రెజాయ్ హెచ్చరిక

టెహ్రాన్: అమెరికాను కాపాడుకోవడానికి ఉన్న చివరి గడువు దగ్గర పడుతోందని ఇరాన్ కొత్త సైనిక సలహాదారు మొహ్సేన్ రెజాయ్ మంగళవారం హెచ్చరించారు. ఇరాన్ ప్రభుత్వ టీవీ చానెల్ ‘ఐఆర్ఎన్ఏ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ మాజీ కమాండర్ కూడా అయిన రెజాయ్ మాట్లాడుతూ.. అమెరికాను స్తంభింపజేస్తామని, అరేబియన్ గల్ఫ్‌‌‌‌‌‌‌‌లో ఆ దేశ నౌకలను ముంచేస్తామని హెచ్చరించారు. 

ఈ ఊబి నుంచి అమెరికాను రక్షించుకోవడానికి ట్రంప్‌‌‌‌‌‌‌‌కు ఎక్కువ సమయం లేదని ఆయన స్పష్టం చేశారు. ‘‘ఇరాన్ మౌలిక సదుపాయాలపై మీరు దాడి చేస్తే.. మా ప్రతిస్పందన ఇకపై కంటికి కన్ను అన్నట్టుగా కాదు.. కంటికి తల అన్నట్టుగా ఉంటుంది. మిమ్మల్ని స్తంభింపజేసి గల్ఫ్‌‌‌‌‌‌‌‌లో ముంచేస్తాం’’ అని రెజాయ్ హెచ్చరించారు.

'గ్రేటర్ ఇజ్రాయెల్' కల నెరవేర్చుకోవడానికి ఇజ్రాయెల్ పాలక యంత్రాంగం ట్రంప్ ప్రభుత్వాన్ని మోసం చేసి ఈ యుద్ధంలోకి నెట్టిందని ఆయన ఆరోపించారు. ఇప్పుడు ట్రంప్ తన సైనిక కమాండర్లు, ఇజ్రాయెల్ మధ్య నలిగిపోతున్నారని ఎద్దేవా చేశారు. 

ఈ యుద్ధం 'అక్రమం' అని పేర్కొన్న ఆయన.. ఇరాన్‌‌‌‌‌‌‌‌పై ఉన్న అన్ని ఆంక్షలను ఎత్తివేసి, నష్ట పరిహారం చెల్లించి, భవిష్యత్తులో దాడులు జరగవని అంతర్జాతీయ చట్టపరమైన గ్యారెంటీ ఇచ్చే వరకు యుద్ధం ముగియదని తేల్చి చెప్పారు. గత 47 ఏళ్లుగా అమెరికా, ఇజ్రాయెల్‌‌‌‌‌‌‌‌ దేశాలు ఇరాన్ పట్ల శత్రుత్వంతో ఉన్నాయని.. గతంలో ఇరాన్‌‌‌‌‌‌‌‌తో యుద్ధం చేసిన సద్దాం హుస్సేన్‌‌‌‌‌‌‌‌కు కూడా ఇవి సహాయం చేశాయని రెజాయ్ గుర్తు చేశారు.