నిర్మల్ జిల్లా : బాసర ట్రిపుల్ ఐటీలో ఇవాళ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. జూమ్ ద్వారా సమావేశంలో ఇన్ చార్జ్ వీసీ వెంకటరమణ పాల్గొననున్నారు. క్యాంపస్ లో ర్యాగింగ్, కొంతమంది ఆకతాయిల వికృత చేష్టలపై సమావేశంలో చర్చించనున్నారు. ఇప్పటికే ఒక విద్యార్థిని ర్యాగింగ్ చేసిన ఐదుగురు విద్యార్థులను వాళ్ల తల్లిదండ్రులకు అప్పగించి.. ఇంటికి పంపించారు. ట్రిపుల్ ఐటీ ఉన్నతాధికారులు బాధితుడి వెర్షన్ ను కూడా వినే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా ర్యాగింగ్ అంశాన్ని అధికారులు సీరియస్ గా తీసుకున్నారు.
ఐదుగురు విద్యార్థులపై ఎఫ్ఐఆర్
నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీ మరోమారు వార్తల్లో నిలిచింది. మొన్నటి వరకూ వసతులు సరిగ్గా లేవంటూ కొన్నిరోజులు పాటు విద్యార్థులు ఆందోళన చేయగా.. తాజాగా ర్యాగింగ్ కలకలం సృష్టించింది. యూనివర్సిటీలోని యూపీసీ మొదటి సంవత్సరం విద్యార్థులను రెండో సంవత్సరం విద్యార్థులు ర్యాగింగ్ చేశారు. గత మూడు రోజులుగా జూనియర్లను సీనియర్లు వేధిస్తున్నారని పీఎస్ లో డీన్ ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేసిన బాసర పోలీసులు.. ఐదుగురు సీనియర్ విద్యార్థులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ర్యాగింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ర్యాగింగ్ కు యూనివర్సిటీలో అవకాశమే లేదని ఇన్ చార్జ్ వీసీ వెంకటరమణ హెచ్చరించారు.
