- ఆసిఫాబాద్ జిల్లా కొత్తగూడ గ్రామంలో గిరిజనులకు చెందిన 25 ఇండ్లు పూర్తి
- సోమవారం సామూహిక గృహప్రవేశాలు, హాజరుకానున్న సీఎం రేవంత్‌రెడ్డి
- ఆనందంలో గిరిపుత్రులు
ఆసిఫాబాద్, వెలుగు : ఇప్పటి వరకు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ పూరి గుడిసెల్లో జీవిస్తున్న ఆదివాసీలు మరొక్క రోజులో కొత్త బంగ్లాల్లోకి అడుగుపెట్టనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదలుపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం కొఠారి గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్తగూడ గ్రామ రూపురేఖలనే మార్చి వేసింది.
ఈ పథకం కింద మంజూరైన ఇండ్ల నిర్మాణం పూర్తికావడం, సోమవారం జరగనున్న సామూహిక గృహప్రవేశానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరవుతుండడంతో గిరిపుత్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
- ఏండ్లుగా పూరి గుడిసెల్లోనే...
కొఠారి గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్తగూడ గ్రామంలో 34 కుటుంబాలు, 165 మంది ప్రజలు నివసిస్తున్నారు. వీరంతా ఆదిమ గిరిజన తెగకు చెందిన వారే. వీరు ఎన్నో ఏండ్లుగా మట్టిగోడలు, తాటాకు గుడిసెలు, గూనపెంకులు, రేకుల ఇండ్లలోనే ఉంటున్నారు. వానాకాలం వచ్చిందంటే ఇల్లు ఉరవకుండా ప్రతియేటా రిపేర్లు చేసుకోవాల్సి వచ్చేది. అడవి నుంచి తెచ్చుకున్న పొరక కప్పుకోవడం, వర్షపు నీళ్లు పడకుండా ఇంటిపై కవర్లు వేసుకోవాల్సి వచ్చేది. బంగ్లా ఇల్లు అనేది ఆదిమ గిరిజన తెగ ప్రజలకు ఇన్నాళ్లు కలగానే మిగిలిపోయింది.
- మొదటి విడతలో 25 ఇండ్లు
ఇందిరమ్మ ఇండ్ల మొదటి విడత పథకం కింద కొఠారి గ్రామ పంచాయతీకి 110 ఇండ్లు మంజూరయ్యాయి. ఇందులో కొత్తగూడ గ్రామానికి 25 ఇండ్లు కేటాయించారు. ఇక్కడ ఇండ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం, ఆఫీసర్లు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఇండ్ల నిర్మాణ పనులు స్పీడ్‌గా సాగాయి.
ప్రస్తుతం ఒక్కటి తప్ప మిగతా ఇండ్ల నిర్మాణాలు పూర్తి అయి గృహప్రవేశాలకు ఏర్పాట్లు జరుగుతుండడంతో ఆదివాసీగూడెంలో పండుగ వాతావరణం నెలకొంది. ‘మా జీవితంలో పక్కా ఇల్లు అనేది కలగానే ఉండేది, ఇప్పుడు మా పిల్లలు భద్రమైన ఇంట్లో పెరుగుతారు, ఎవరన్నా అడిగితే మాకు బిల్డింగ్ ఉందని చెప్పుకుంటాం’ అంటూ లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గుడిసెల నుంచి పక్కా ఇంటిలోకి మారడమే తమ జీవితంలో అతిపెద్ద మార్పు అని చెబుతున్నారు.
జూన్ 01 సామూహిక గృహప్రవేశాలు.. హాజరుకానున్న సీఎం రేవంత్‌రెడ్డి
కొత్తగూడ గ్రామంలో ఇండ్ల నిర్మాణాలు పూర్తి కావడంతో సోమవారం సామూహిక గృహప్రవేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరవుతుండడంతో ఆదివాసీలు ఆనందంలో మునిగిపోయారు. సీఎం టూర్ నేపథ్యంలో హెలిప్యాడ్, సీసీ రోడ్ల నిర్మాణం, గ్రామంలో శుభ్రత, రంగురంగుల అలంకరణలు, స్వాగత తోరణాలతో ఊరంతా కళకళలాడుతోంది. సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం సాయంత్రం 4 గంటలకు హెలికాప్టర్‌లో కొత్తగూడకు చేరుకోనున్నారు.
గృహప్రవేశాల అనంతరం స్థానిక ఆదివాసీలతో కలిసి సహపంక్తి భోజనాలు చేస్తారు. తర్వాత లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించిన అనంతరం కాగజ్‌నగర్ ఎక్స్‌రోడ్డు వద్ద బహిరంగ సభకు హాజరవుతారు. సభ అనంతరం హైదరాబాద్ తిరుగుపయనం కానున్నారు. సీఎం టూనే నేపథ్యంలో... ఆదివాసీ గిరిజన ప్రజల కోసం ప్రత్యేక పథకాలు, కార్యాచరణ ప్రకటించే అవకాశాలు ఉన్నాయని
తెలుస్తోంది.
ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు ఆత్రం పోచుబాయి. భర్త తిరుపతి, కొడుకు, కూతురితో కలిసి తడకలు, రేకుల ఇంట్లోనే ఉండేది. ప్రతి రోజు కూలీ పనులకు వెళ్తేనే ఇల్లు గడవడం, పిల్లలను సాదడం కుదిరేది. ఎండ, వర్షం కారణంగా పాత ఇంట్లో తీవ్ర ఇబ్బందులు తలెత్తేవి. ఈ కుటుంబానికి మొదటి విడతలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయింది. ఇంటి నిర్మాణం పూర్తి కావడంతో సోమవారం గృహప్రవేశం చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇన్నాళ్లూ పాత ఇంట్లో పడిన ఇబ్బందులు ఇక నుంచి తొలగిపోతాయని ఆనందం వ్యక్తం చేస్తోంది.
- పక్కా ఇల్లు కట్టుకుంటామని ఎప్పుడూ అనుకోలే...
మాది వ్యవసాయం చేసుకుని బతికే కుటుంబం. మా కుటుంబంలో ఎవరికీ పక్కా ఇల్లు లేదు. చేసుకుని బతికే మాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడం అదృష్టం. వానకు, ఎండకు, చలికి అవస్థ పడుతూ బతికినం. ఇప్పుడు సొంతిల్లు పూర్తి కావడం చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. మా గ్రామంలో తొలి విడతలో మంజూరు అయిన ఇండ్లు పూర్తయ్యాయి. సీఎం వచ్చి మాతో కలుస్తారని చెప్పడంతో ఊరంతా ఆనందంగా ఉంది. సీసీ రోడ్లు ఇతర అభివృద్ధి పనులతో ఒక్కసారిగా ఊరి కళ మారింది.
మడవి శాంతాబాయి, లబ్ధిదారురాలు, సర్పంచ్, కొఠారి గ్రామ పంచాయతీ
- వరద బాధలు ఉండవు
మేము ఉన్న పరిస్థితుల్లో ఇల్లు కట్టుకునే స్తోమత లేదు. కూలీ చేసుకోవడం, వ్యవసాయం చేయడమే వచ్చు. కష్టపడ్డ పైసలు కేవలం బతుకుదెరువుకే సరిపోయేవి. సర్కారు ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లతో మా సొంతింటి కల నెరవేరింది. పందిరి ఇంట్లో ఉండడం వల్ల వానాకాలంలో వరద నీటి కారణంగా తీవ్ర ఇబ్బందులు పడేవాళ్లం. ఇక ముందు ఇలాంటి బాధలు ఉండవు. రేవంత్‌రెడ్డి సర్కారు ఇచ్చిన ఇందిరమ్మ ఇంటితో భరోసా కలిగింది. సర్కారుకు రుణపడి ఉంటాం. సీఎం మా ఊరికి వస్తున్నాడని తెలిసి చాలా సంతోషంగా ఉంది.
సిడాం భీంబాయి, లబ్ధిదారురాలు, కొత్తగూడ
