ఈ ప్రమాణికుడు మహా ముదురు..ఎమర్జెన్సీ లైట్ లో అక్రమంగా గోల్డ్ తరలింపు

ఈ ప్రమాణికుడు మహా ముదురు..ఎమర్జెన్సీ లైట్ లో అక్రమంగా గోల్డ్ తరలింపు

స్మగ్లర్లు కొత్త కొత్త దారుల్లో బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. కొత్త కొత్త సాంకేతికతను వాడుతూ యథేచ్ఛగా బంగారం స్మగ్లింగ్ చేస్తున్నారు. పేస్ట్ రూపంలో, చాక్లెట్ల మాదిరిగా, బిస్కెట్లు లాగా.. ఇలా రకరకాలుగా బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. అనేక మార్గాల్లో విదేశాల నుండి హైదరాబాద్ కు బంగారాన్ని తీసుకొస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు. ఇలాంటి వారిని హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయ అధికారులు వివిధ మార్గాల్లో గుర్తించి పట్టుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు ఈ మధ్యకాలంలో చాలా బయటపడుతున్నాయి. తాజాగా మరోసారి కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో భారీగా బంగారం పట్టుబడింది. రూ.1.81 కోట్ల విలువైన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన ఓ ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేయడంతో బండారం మొత్తం బయటపడింది. ప్రయాణికుడి వద్ద ఉన్న ఎమర్జెన్సీ లైట్‌లో దాచి తీసుకొచ్చిన బంగారాన్ని తనిఖీల్లో అధికారులు గుర్తించారు. ప్రయాణికుడి నుంచి దాదాపు రూ.1.82 కోట్లు విలువైన 2 వేల 915 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్‌ అధికారులు వెల్లడించారు. నిందితుడిని అరెస్ట్ చేసి, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. 

మరోవైపు.. రియాద్ నుండి హైదరాబాద్ కు వచ్చిన ముగ్గురు వ్యక్తుల నుండి భారీ మొత్తంలో బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ రూ.1.13 కోట్ల ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు.  ఆ బంగారాన్ని ఎక్కడి నుండి ఎక్కడికి తరలిస్తున్నారు, దాని వెనక ఎవరు ఉన్నారు అనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నారు.