అఫ్గానిస్తాన్​లో పెను భూకంపం..14 మంది మృతి

అఫ్గానిస్తాన్​లో పెను భూకంపం..14 మంది మృతి

కాబూల్: పశ్చిమ అఫ్గానిస్తాన్​లో శనివారం భారీ భూకంపం సంభవించింది. మధ్యాహ్నం సమయంలో నిమిషాల వ్యవధిలో మూడుసార్లు భూమి కంపించింది. ఈ ప్రమాదంలో పలు భవనాలు కూలిపోయాయి. వాటి శిథిలాల కింద ఇరుక్కొని ఇప్పటి వరకు14 మంది మృతిచెందగా, 78 గాయపడ్డారు. రిక్టర్​స్కేలుపై మొదటి భూకంప తీవ్రత 6.1గా, రెండోసారి 5.6గా, మూడోసారి 6.3గా నమోదైంది. 

చాలా మందికి తీవ్ర గాయాలు కావడంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని హెరాత్ ప్రావిన్స్ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ మహ్మద్ తలేబ్ షాహిద్ చెప్పారు. పశ్చిమ అఫ్గానిస్తాన్​లోని ప్రధాన పట్టణ కేంద్రమైన హెరాత్ సిటీకి వాయవ్యంగా 40 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అంతకు ముందు సెప్టెంబర్ 4 న అఫ్గాన్​లోని ఫైజాబాద్‌‌లో 4.4 తీవ్రతతో, ఆగస్టు 28న 4.8 తీవ్రతతో రెండు భూకంపాలు సంభవించాయి.