ఏడాది కావస్తున్నా పూర్తికాని రేషన్ డీలర్ల నియామక ప్రక్రియ

ఏడాది కావస్తున్నా పూర్తికాని రేషన్ డీలర్ల నియామక ప్రక్రియ

సిద్దిపేట, వెలుగు : జిల్లాలో ఖాళీగా ఉన్న రేషన్ షాపులకు డీలర్ల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గతేడాది జులై లో 74 ఖాళీలకు నోటిఫికేషన్ ను జిల్లా అధికారులు విడుదల చేశారు. సిద్దిపేట డివిజన్ లో 32, గజ్వేల్​లో 17, హుస్నాబాద్​లో 25 డీలర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించారు. మొదట జిల్లాలో 74  డీలర్ పోస్ట్ లు ఖాళీగా ఉన్నట్టు ప్రకటించినా వివిధ కారణాలతో కేవలం 52 పోస్టులకు మాత్రమే రిజర్వేషన్లు ప్రకటించగా, మిగతా 22 పోస్టులను వివిధ కారణాలతో హోల్డ్ లో పెట్టారు. కొన్ని రేషన్ షాపులను సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల సభ్యులు నిర్వహిస్తుండగా, మరికొన్నింటిపై కోర్టు కేసులుండటం, డీలర్లు మరణించిన చోట వారి కుటుంబాలకు కేటాయించాల్సిన వాటి భర్తీని నిలిపివేశారు. అందిన దరఖాస్తులలో నుంచి అర్హులైన వారికి రాత పరీక్షలు నిర్వహించి వాటిలో క్వాలిఫై అయిన వారికి ఇంటర్వ్యూలు నిర్వహించిన తరువాత రిజర్వేషన్ల ప్రకారం ఎంపిక ప్రక్రియను నిర్వహించాల్సి వుంది. సిద్దిపేట డివిజన్ లో నియామక ప్రక్రియ పూర్తయినా, గజ్వేల్, హుస్నాబాద్ డివిజన్ లో రాత పరీక్షలు మాత్రమే పూర్తయ్యాయి. 

తప్పని ఎదురు చూపులు.. 

గజ్వేల్, హుస్నాబాద్ డివిజన్ల పరిధిలో రేషన్ డీలర్ల నియామకానికి ఎంపిక చేసిన అభ్యర్థులకు ఆరు నెలల కింద పరీక్షలు నిర్వహించినా ఇప్పటికీ ఇంటర్వ్యూలకు ఎంపికైన జాబితాలను వెల్లడించలేదు. ఈ విషయం లో రెండు డివిజన్ల పరిధిలో తీవ్ర జాప్యం ఎందుకు జరుగుతుందనే విషయంలో ఎలాంటీ స్పష్టత లేదు. నోటిఫికేషన్ విడుదలై  ఏడాది గడుస్తున్నా రేషన్ డీలర్ల ను నియమించక పోవడంపై  హుస్నాబాద్, గజ్వేల్ ఆర్డీవోలు జయచంద్రారెడ్డి, విజయేందర్ రెడ్డిని వివరణ కోరగా  నియామక ప్రక్రియను త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. కొన్ని అనివార్య కారణాలతో ఇంటర్వ్యూ ప్రక్రియ ఆలస్యమైందని చెప్పారు. 

భారీగా దరఖాస్తులు..

రేషన్ డీలర్ పోస్టులకు భారీ సంఖ్యలో దరఖాస్తులు అందాయి. గజ్వేల్ డివిజన్ లో 17 పోస్టులకు గాను 11 పోస్టులకు రిజర్వేషన్ ప్రకటించండంతో మొత్తం 56 దరఖాస్తులు రాగా, అర్హులైన 33 మందికి  పరీక్షలు నిర్వహించారు.  హుస్నాబాద్ డివిజన్ పరిధిలో 25 పోస్టులకు గాను, 19 పోస్టులకు మాత్రమే రిజర్వేషన్లు ప్రకటించారు. వీటికి మొత్తం 220 దరఖాస్తులు రాగా,  అర్హులైన 215 మంది జాబితాను రూపొందించి పరీక్షలు నిర్వహించారు. రెండు డివిజన్ల పరిధిలో మొత్తం 36 పోస్టులకు 376 మంది రాత పరీక్షలు రాశారు.