Tiger : పెద్దపులి ఆచూకీ దొరికిందోచ్..!

Tiger : పెద్దపులి ఆచూకీ దొరికిందోచ్..!

Tiger : నంద్యాల జిల్లా కొత్తపల్లె మండలం పెద్ద గుమ్మడాపురం శివార్లలోకి నాలుగు పిల్లలతో వచ్చిన తల్లి పులి (Tiger) ఆచూకీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ‘ఆపరేషన్ మదర్ టైగర్’ భాగంగా పెద్దపులి ఆచూకీ తెలిసినట్లు సమాచారం అందుతోంది. పెద్ద గుమ్మాడాపురం అటవీ ప్రాంతంలో పులి అడుగుజాడలను అటవీశాఖ సిబ్బంది (Forest Officers ) గుర్తించారు. అయితే.. అవి పెద్దపులి (T108 F) పాదముద్రలా కదా..? అనే తేల్చే పనిలో పడ్డారు.  

పులి కోసం అన్వేషణ

రెండు రోజులుగా తల్లి పులి కోసం అటవీశాఖ అధికారులు చుట్టుపక్కల ప్రాంతాల్లో జల్లెడ పడుతున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ దాని కోసం అన్వేషిస్తున్నారు. దాదాపు 300 మంది సిబ్బంది, 50 మందికి పైగా అటవీశాఖ అధికారులతో ‘ఆపరేషన్ మదర్ టైగర్’ కార్యక్రమాన్ని చేపట్టారు. 200 హెక్టార్లలో 40 ట్రాప్ కెమెరాలతో ట్రేస్ చేస్తున్నామని, అవసరాన్ని బట్టి డ్రోన్ కెమెరాలను కూడా వాడుతున్నామని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. నిపుణుల సూచనల మేరకు పులి కూనలకు పాలు, సెరోలాక్ తో పాటు లివర్ ముక్కలను కూడా ఆహారంగా పెట్టామంటున్నారు. 

తల్లి కోసం ఎదురుచూపులు

తల్లి కోసం పులి కూనలు విలవిల్లాడుతున్నాయి. వాటిని తల్లి చెంతకు చేర్చేందుకు అటవీశాఖ అధికారులు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు.  ప్రస్తుతం నాలుగు పులి పిల్లలు ఆరోగ్యంగా ఉన్నాయి. ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాయి. 

తల్లి వద్దకు చేర్చేందుకు ప్రయత్నాలు

పులి కూనలు కనిపించిన ప్రాంతంలో రెండు కిలోమీటర్ల వలయంలో 70 ఇన్‌ఫ్రారెడ్‌ ట్రాప్‌ కెమెరాలను ఏర్పాటు చేశారు. ముందుగా తల్లి పులిని గుర్తించి.. ఆపై ఆ ప్రాంతానికి పులి పిల్లలను చేర్చాలని అధికారులు భావిస్తున్నారు. తల్లి పులిని గుర్తించిన తరువాత ఒక చిన్నపాటి ఎన్‌క్లోజర్‌లో పులి కూనలను అదే ప్రాంతంలో ఉంచుతారు. తల్లి వాటిని గుర్తించి దగ్గరగా వస్తే కూనలను ఎన్‌క్లోజర్‌ నుంచి వదులుతారు. లేదంటో ప్రత్యామ్నాయం ఆలోచిస్తారు. మరోవైపు.. పులి కూనలను అత్యంత శాస్త్రీయ పద్ధతుల్లో క్షేమంగా తల్లి వద్దకు చేరుస్తామని ధీమాగా చెబుతున్నారు ఫారెస్ట్ ఆఫీసర్లు. 

పెద్ద పులులు సాధారణంగా ఒక కాన్పులో మూడు పిల్లల్ని కంటాయి. వీటిలో మగ, ఆడ కూనలు ఉంటాయి. వాటిలో రెండు మాత్రమే బతికే అవకాశం ఉంటుంది. బతికిన వాటిలో సాధారణంగా ఒక్కొక్క ఆడ, మగ కూనలు ఉండవచ్చు. పెద్ద పులుల సంరక్షణ, సంతతి పెరుగుదలలోనూ ఆడ పులులదే  ప్రధాన పాత్ర. ఒక ఆడపులి తన జీవిత కాలంలో 20 పులులను పునరుత్పత్తి చేయగలదు.