
- బ్రిటన్లో సరికొత్త చికిత్సను ప్రారంభించిన డాక్టర్లు
- గాలి, నీరు ఫిల్టర్ చేసినట్టే రక్త శుద్ధి
- క్యాన్సర్, స్ట్రోక్, న్యూరోటాక్సిసిటీ నుంచి విముక్తి కల్పిస్తామని వెల్లడి
లండన్: ఐదు మిల్లీ మీటర్ల కంటే చిన్నగా ఉండే సింథటిక్ ప్లాస్టిక్ కణాలు మన శరీరంలోకి నోటి ద్వారా, శ్వాస ద్వారా లేదా చర్మ రంధ్రాల ద్వారా ప్రవేశిస్తాయి. సగటున ఒక వ్యక్తి శరీరంలోకి ఏడాదికి 39 వేల నుంచి 52 వేల మైక్రోప్లాస్టిక్ కణాలు చేరుతున్నట్టు అధ్యయనాల్లో తేలింది. ఒంట్లో చేరిన ఈ ప్లాస్టిక్కణాలు ఆక్సిడేటివ్ స్ట్రెస్, డీఎన్ఏ, అవయవాల పనితీరును దెబ్బతీస్తున్నాయి.
దీంతో హార్ట్‌అటాక్స్, స్ట్రోక్స్, న్యూరోటాక్సిసిటీ, జీవక్రియ రుగ్మతలు, రోగనిరోధక వ్యవస్థ, నరాల బలహీనత, పునరుత్పత్తి సమస్యలు వస్తున్నాయి. ఈ కణాలు క్యాన్సర్‌కు కూడా కారణమవుతున్నాయి. అయితే, ఈ మైక్రోప్లాస్టిక్ పనిపట్టే సరికొత్త చికిత్సను బ్రిటన్‌లోని లండన్‌కు చెందిన ఓ క్లినిక్ అందుబాటులోకి తెచ్చింది. రూ. 13 లక్షలిస్తే.. మనిషి ఒంట్లోని మైక్రో ప్లాస్టిక్‌ను మొత్తం క్లీన్ చేస్తామని చెబుతున్నది.
చికిత్స ఇలా చేస్తారు..
లండన్‌లోని ఎలైట్డిటాక్స్ క్లినిక్‌ను సౌత్ ఆఫ్రికన్–కెనడియన్ ఆక్టివిస్ట్ యాయెల్ కోహెన్ స్థాపించారు. గాలిని, నీటిని ఫిల్టర్ చేసినట్టే రక్తాన్ని ఫిల్టర్ చేసేలా సరికొత్త చికిత్సను అందుబాటులోకి తెచ్చినట్టు చెబుతున్నారు. దీనికి ‘క్లారీ ప్రొసీజర్’ అని పేరు పెట్టారు. ఇందులో అఫెరెసిస్ టెక్నాలజీతో మనిషి రక్తంలోని ప్లాస్మాను వేరు చేస్తారు. దాన్ని మెషీన్ గుండా పంపి మైక్రోప్లాస్టిక్స్, హానికర కెమికల్స్, ఇతర వ్యర్థాలను తొలగిస్తారు. శుభ్రం చేసిన ప్లాస్మాను రక్త కణాలతో కలిపి శరీరంలోకి పంపుతారు. ఈ చికిత్స మొత్తం రెండు గంటల్లోపు పూర్తి అవుతుంది.