బంగాళాఖాతంలో అల్పపీడనం : ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం : ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

బంగాళాఖాతంలో నవంబర్14వ తేదీ మంగళవారం అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ (ఐఎండీ) అధికారులు తెలిపారు. నవంబర్ 14, 15వ తేదీల్లో దక్షిణ కోస్తా, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని చెప్పారు. 16వ తేదీ నాటికి అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశం ఉందన్నారు. 

థాయ్‌లాండ్. గల్ఫ్ నుండి వచ్చిన తుఫాను దక్షిణ అండమాన్ సముద్రంలోకి ప్రవేశించిందని ఐఎండీ అధికారులు చెప్పారు. దీని ప్రభావంతో మంగళవారం (నవంబర్ 14)  నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు. నవంబర్ 20 నాటికి ఒడిశా-, పశ్చిమ బెంగాల్ తీరాలకు చేరుకుంటుంది. అయితే ఇది తుఫానుగా మారుతుందా...? లేదా అనే విషయాన్ని వాతావరణ శాఖ ఇంకా ప్రకటించలేదు.

రానున్న 48 గంటల్లో అల్పపీడనం మరింత బలపడి అల్పపీడనంగా మారి దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య దాని పరిసర ప్రాంతాలపై నవంబర్ 16న ప్రభావం చూపుతుందని చెప్పారు. నెల రోజుల క్రితమే బంగాళాఖాతంలో హమూన్ తుపాను ఏర్పడింది. ఇది బంగ్లాదేశ్ తీరాన్ని తాకిన విషయం తెలిసిందే. ఇది మిజోరాంలో భారీ వర్షపాతానికి కారణమైంది.

మరోవైపు.. తెలంగాణలోనూ పలు చోట్ల మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం పశ్చిమ వాయవ్య దిశగా ఉపరితల ఆవర్తనం పయనిస్తోందని చెప్పారు. సాధారణంగా నవంబర్ నెలలో బంగాళాఖాతం యాక్టివ్‌గా ఉంటుంది. తుఫాన్లు వచ్చే అవకాశాలు ఎక్కువే. అల్పపీడన ప్రభావంతోమత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.