కేసీఆర్ వీరాభిమాని వినూత్న నిరసన

కేసీఆర్ వీరాభిమాని వినూత్న నిరసన

యాదాద్రి భువనగిరి జిల్లా : మునుగోడు నియోజకవర్గంలో వినూత్న పద్ధతిలో నిరసన వ్యక్తం చేస్తున్న సీఎం కేసీఆర్ అభిమాని పోలెపల్లి నర్సింహ్మను మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరామర్శించారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని తంగడిపల్లిలో నివాసం ఉంటున్న నర్సింహ్మ ఇంటికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెళ్లారు. ఆర్థిక ఇబ్బందులతో ఉన్న పోలేపల్లి నర్సింహ్మ దంపతులకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేశారు. అధైర్య పడొద్దని, తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. 

ఉద్యమకారులను విస్మరించారు

తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఒక్క ఉద్యమకారుడిని కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదనడానికి పోలెపల్లి నర్సింహ్మ ప్రత్యక్ష ఉదాహరణ అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలని, ప్రత్యేక రాష్ట్ర సాధనలో చాలా మంది నర్సింహ్మలాంటి వ్యక్తులు ఉన్నారని చెప్పారు. ఉద్యమకారులు త్యాగాలు చేస్తే.. ఫలితాలు అనుభవించేది మాత్రం కేసీఆర్ కుటుంబ సభ్యులు అని అన్నారు. ఇప్పటికీ తెలంగాణ ఉద్యమకారులకు ఎలాంటి లబ్ది చేకూరలేదన్నారు. ఇప్పటికైనా ఉద్యమకారులను గుర్తించి.. వారికి ఇండ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రధాన పాత్ర పోషించిన ప్రొఫెసర్ జయశంకర్ ను టీఆర్ఎస్ ప్రభుత్వం మరిచిపోయిందన్నారు. జయశంకర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. మునుగోడు నియోజకవర్గానికి ఈఎస్ఐ ఆసుపత్రి, స్టేడియం ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రులను అడిగితే ఒప్పుకున్నారని తెలిపారు. మునుగోడులో యువతకు స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రం, రోడ్ల నిర్మాణాలకు రూ.200 కోట్లు, స్వయం ఉపాధికి ముద్ర లోన్లు ఇవ్వాలని అడిగితే కేంద్రహాంశాఖ మంత్రి అమిత్ షా ఒప్పుకున్నారని చెప్పారు. మునుగోడు నియోజకవర్గం అభివృద్ధికి సహకరిస్తామని చెప్పారని అన్నారు.

ఆదుకోండి..
మునుగోడు నియోజకవర్గానికి చెందిన పోలెపల్లి నర్సింహ్మ’ అనే వ్యక్తి వినూత్న పద్ధతిలో నిరసన తెలియజేశాడు. ‘రోడ్డున పడ్డ మునుగోడు నియోజకవర్గం తెలంగాణ ఉద్యమకారుడు. కేసీఆర్ వీరాభిమాని పోలెపల్లి నర్సింహ్మ’ అనే పేరుతో ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ఆందోళన చేపట్టాడు. తెలంగాణ ఉద్యమంలో తాను 10 ఏళ్లకు పైగా పని చేసినా అధికార పార్టీ నాయకులెవరూ ఆదుకోవడం లేదని పోలేపల్లి నర్సింహ్మ దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేపట్టిన సమయంలో పోలీసుల చేతుల్లో లాఠీ దెబ్బలు తిన్నానని, ఇప్పుడు ఏ పని చేసుకోడానికి తన శరీరం సహకరించడం లేదని పోలేపల్లి నర్సింహ్మ కన్నీటి పర్యంతమయ్యాడు. 

ఉద్యమంలో చాలా కష్టపడ్డా

టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సహాయం చేస్తారని ఎనిమిదేండ్లుగా ఎదురుచూస్తున్నానని నర్సింహ్మ చెప్పాడు. తమ ఆర్థిక పరిస్థితి గురించి టీఆర్ఎస్ నాయకులకు ఇప్పటికే చాలా సార్లు చెప్పినా.. ఎవరూ పట్టించుకోవడం లేదంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఫ్లెక్సీ ఏర్పాటు చేసి.. సహాయం కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. తెలంగాణ ఉద్యమం సమయంలో రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడ్డానని నర్సింహ్మ చెప్పాడు. 

కనీసం ఇల్లు ఇప్పించండి

కనీసం తమకు ఉండేందుకు ఒక ఇల్లు, ఏదైనా వ్యాపారం చేసుకునేందుకు దళితబంధు ఇప్పించాలని నర్సింహ్మ దంపతులు రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. తమ కుమారుడి ఆరోగ్యం పరిస్థితి ఏ మాత్రం బాగోలేదని, మందులకే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తోందన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న తమ అబ్బాయితో ఒకే రూమ్ లో ఉంటున్నామని, కనీసం తమ ఇంటికి బంధువులు కూడా రావడం లేదని కన్నీటి పర్యంతమయ్యారు.