కేరళ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి ఏకంగా విమానాన్నే తయారు చేసి, ఇప్పుడు ప్రపంచాన్నే చుట్టేస్తున్నాడు. తన కుటుంబంతో కలిసి ఎంచక్కా ఎంజాయ్ చేస్తున్నాడు. ఆయా దేశాల్లోని పరిస్థితులను వివరిస్తూ.. సోషల్ మీడియాలో తన అనుభవాలను పంచుకుంటున్నాడు.
కేరళలోని అలప్పుజాకు చెందిన అశోక్ అలిసెరిల్ థమరాక్షన్ అనే వ్యక్తి.. తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణించేందుకు ఎప్పటి నుంచో చిన్న విమానం కావాలనుకున్నాడు. స్వతహాగా మెకానికల్ ఇంజనీర్ అయిన అశోక్ చాలా తక్కువ ఖర్చుతో విమానాన్ని తయారు చేయాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో 4 సీటర్ విమానాన్ని తయారు చేశాడు. కేవలం 18 నెలల్లో అశోక్ స్లింగ్ TSi మోడల్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను తయారు చేశాడు. దానికి తన చిన్న కుమార్తె దియా పేరు పెట్టాడు. విమానాన్ని తయారు చేయడం కోసం జోహన్నెస్‌బర్గ్‌లోని స్లింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ నుంచి అసెంబ్లీ కిట్‌ను కొనుగోలు చేశాడు. తన ఇంట్లోనే 1.8 కోట్ల రూపాయలతో ప్రాజెక్ట్‌ను పూర్తి చేశాడు. ఆ తర్వాత విమానం తయారీని UK పౌర విమానయాన అధికారులు కూడా పర్యవేక్షించారు. 4 సీటర్ విమానం గరిష్టంగా 200 kmph వేగంతో ప్రయాణించగలదు. గంటకు 20 లీటర్ల ఇంధనం అవసరం పడుతుంది.
‘2018లో పైలట్ లైసెన్స్ పొందిన తర్వాత ప్రయాణాల కోసం రెండు -సీట్ల విమానాలను అద్దెకు తీసుకున్నాం. ఆ తర్వాత మాకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టడంతో రెండు సీట్ల విమానం సరిపోలేదు. మాకు నాలుగు- సీట్ల విమానం అవసరం ఏర్పడింది. అప్పుడే నాలుగు సీట్ల విమానం తయారు చేయాలనే ఆలోచన వచ్చింది’ అని అశోక్ అలిసెరిల్ థమరాక్షన్ వివరించాడు. లాక్ డౌన్ సమయంలో కేవలం 18నెలల సమయంలో విమానాన్ని తయారు చేశానని చెప్పాడు.
పైలట్ లైసెన్స్ కలిగి ఉన్న అశోక్ అలిసెరిల్ థమరాక్షన్ ... తన కుటుంబంతో కలిసి విమానంలో పర్యటనలు మొదలుపెట్టాడు. ఆ చిన్న విమానంలో యూరప్ చుట్టేశాడు. తన కుటుంబంతో కలిసి నాలుగు సీట్లలో ఇప్పటివరకు జర్మనీ, ఆస్ట్రియా, చెక్ రిపబ్లిక్ సందర్శించారు. అశోక్ అలిసెరిల్ థమరాక్షన్ కేరళ మాజీ ఎమ్మెల్యే ఏవీ తమరాక్షన్ కుమారుడు. 2016లో లండన్‌కు వెళ్లి తన భార్య, కుమార్తెలతో స్థిరపడ్డారు. అశోక్ అలిసెరిల్ ఉన్నత చదువుల కోసం 2006లో UKకి వెళ్లాడు. అతను ప్రస్తుతం ఫోర్డ్ మోటార్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.
