8 గంటల్లో నా భార్యను తీసుకురావాలె..!

8 గంటల్లో నా భార్యను తీసుకురావాలె..!
  • లేకపోతే మా శవాల లొకేషన్​పెడ్తా..
  • సోషల్​ మీడియాలో బీఎస్​పీ నేత సత్యమూర్తి పోస్టు​
  • 3 నెలలైనా పోలీసులు పట్టించుకోలేదని ఆవేదన
  • కూతుళ్లతో సెల్ఫీ వీడియో తీసి అజ్ఞాతంలోకి..

వికారాబాద్, వెలుగు : మూడు నెలలు గడుస్తున్నా.. తన భార్యను వెతికిపెట్టడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, వెంటనే తన భార్యను తీసుకురాకపోతే కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానంటూ.. వికారాబాద్​ జిల్లా తాండూర్​కు చెందిన బీఎస్​పీ జిల్లా ప్రెసిడెంట్​దొరశెట్టి సత్యమూర్తి సోషల్​ మీడియాలో వీడియో పోస్టు చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ‘‘నా భార్య అన్నపూర్ణ మూడు నెలల కింద ఇంటి నుంచి వెళ్లిపోయింది. కొంత మంది లీడర్ల కారణంగానే ఇది జరిగింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలె... నా భార్య మిస్సింగ్​ వెనుక బడా బాబుల హస్తం ఉంది. అందుకే ఈ కేసు విషయంలో పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారు. నా కూతుళ్లు నిక్కి, అక్షిలు చాలా బాధపడుతున్నారు. మూడు నెలలైనా నా భార్య ఆచూకీని పోలీసులు కనిపెట్టలె.. అమ్మ కోసం ఇద్దరు పిల్లలు చాలా ఏడుస్తున్నారు. 48 గంటల్లో నా భార్య అన్నపూర్ణను క్షేమంగా ఇంటికి చేర్చాలె.. లేకపోతే లొకేషన్​ పంపి ముగ్గురం ఆత్మహత్య చేసుకుంటాం. అప్పుడు వచ్చి మా శవాలను తీసుకెళ్లండి. దీనికి కారణం పోలీసులు, రాష్ర్ట ప్రభుత్వమే అవుతుంది” అంటూ దొరశెట్టి సత్యమూర్తి సెల్ఫీ వీడియో పోస్టు చేసి అదృశ్యమయ్యారు. శనివారం తెల్లవారుజాము నుంచి ఈ వీడియో వైరల్​ అవుతోంది. తాండూర్​ ఇంటి నుంచి సత్యమూర్తి, తన ఇద్దరు పిల్లలతో టీఎస్​ 34 టీ 7324 క్రెటా కారులో బయలుదేరినట్టు తెలుస్తోంది. పరిగి సమీపంలో చివరిసారిగా ఫోన్​ సిగ్నల్​ను పోలీసులు గుర్తించినట్టు సమాచారం. సత్యమూర్తి సెల్ఫీ వీడియోపై డీఎస్​పీ శేఖర్​గౌడ్​ మీడియాకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. మిస్సింగ్​ కేసులో పురోగతి లేదంటూ సత్యమూర్తి తొందరపాటు నిర్ణయం తీసుకోవడం తగదని తెలిపారు. ప్రాణం పోతే తిరిగిరాదని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. పోలీసులకు సహకరించేందుకు సత్యమూర్తి వెంటనే అజ్ఞాతం వీడాలని, తప్పకుండా న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.